తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం శాసన సభ ముస్తాబైంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు అసెంబ్లీలో ప్రతిబింబించనున్నాయి. గతంలో శాసన సభలో టిఆర్‌ఎస్‌కు ఎంఐఎం పార్టీ అండగా నిలవగా, ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతటి అనుబంధం కనిపించడం లేదు. టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో ఈ ప్రభావం అసెంబ్లీ సమావేశాల్లోకనిపించే అవకాశం ఉంది. అసెంబ్లీలో దూకుడు పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

అధికారపక్షం స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు సన్నద్ధం అవుతోంది. హోలీ తరవాత రోజునుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనూ వర్ణ మిశ్రమం కనులవిందు చేయనుంది. టిఆర్‌ఎస్ గులాబీ, బిజెపి కాషాయం, టిడిపి పసుపురంగు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నీలం రంగు, సిపిఐ, సిపిఎం సభ్యులు ఎరుపు రంగు కండువాలు ధరించి తొలిరోజు సభకు రానున్నారు. తొలిసారి జరిగిన సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలకు పెద్దగా అవకాశాలు కనిపించలేదు.

టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావడంతో హనీమూన్ పిరియడ్ ముగిసిపోయిందని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. ఎన్నికల ప్రణాళికలో టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అంశంపైనే ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇక టిడిపి విషయానికి వస్తే...చంద్రబాబు కనుసన్నల్లో నడిచే పార్టీ సభ్యులకు, బాబులేని సభలో నాయకత్వం ఇబ్బందికరమే. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ అని ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రకటనలు వెలువడుతుంటాయి.

తెలంగాణ టిడిపి శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావే అయినా సభలో మాత్రం రేవంత్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారు. టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా విడిగా ఉంటారు. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యేలు ముగ్గురు టిఆర్‌ఎస్‌లో చేరగా, మరో ముగ్గురు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలకు సంబంధించిన విషయాల్లో మిగిలిన పక్షాలు ప్రభుత్వాన్ని సమర్ధించినా టిడిపి ఆ పని చేయలేని పరిస్థితి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నాయకుడే టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ ప్రభావం సభలో నామమాత్రంగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: