రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించలేదని ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. అలాగే ఆంధ్రా రాజధాని విషయం కూడా. ఓ రాష్ట్రానికి రాజధానిని పునాదుల నుంచి నిర్మించే అవకాశం చరిత్రలో ఏ కొంతమందికోగానీ రాదు. ఆ అవకాశం చంద్రబాబాబుకు దక్కింది. టీడీపీ సర్కారు 2018 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఢంకా బజాయిస్తోంది.

టీడీపీ మంత్రులకు ఆత్మవిశ్వాసం కాస్త ఎక్కువగానే ఉన్నా.. అది సాధ్యం కాదన్న సంగతి అందరికీ తెలుసు.. కాకపోతే.. ప్రధాన కట్టడాల నిర్మాణాలు పూర్తి కావచ్చు. ఆ మాత్రం జరిగినా అది గొప్పే. బాబు చెబుతున్నట్టు మాస్టర్ ప్లాన్ ప్రకారం.. లక్ష ఎకరాల్లోని రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే.. కనీసం పదేళ్లు పడుతుందని ఓ అంచనా. ఈలోపు 2019లో ఏపీలో ఎన్నికలు వస్తాయి.

2019 ఎన్నికల్లో జనం చంద్రబాబును ఓడిస్తే రాజధాని సంగతి ఏమవుతుంది. సింగపూర్ తరహా రాజధానిని మొదటినుంచి వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్.. చంద్రబాబు డిజైన్ ను కొనసాగిస్తారా.. రైతులతో బాబు ప్రభుత్వం చేసుకున్న ఇప్పటి ఒప్పందాలను జగన్ కొనసాగిస్తారా.. అధికారంలోకి వస్తే మీ భూములు మీకిస్తానంటున్న జగన్.. ఒక వేళ అధికారంలోకి వస్తే.. ఆ పని చేసే పరిస్థితి ఉంటుందా..

ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజధాని రైతులను వేధిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తూ భూములు ఇచ్చేసిన మెట్టప్రాంత రైతులు.. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేతులు మారితే తమ భవిష్యత్ ఏంటన్న ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు సర్కారుకు సహకరించారన్న కారణంతో జగన్ ఫ్యూచర్లో వేధిస్తే.. తమ పరిస్థితేంటన్న ఆలోచనలో పడ్డారు. అధికారంలోకి ఎవరొచ్చినా.. ఇష్టారాజ్యం నిబంధనలు మార్చకుండా చట్టబద్దత కల్పించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: