ఆంధ్రా అసెంబ్లీ సమావేశాల్లో.. అందరి దృష్టీ ఆ ఇద్దరిపైనే ఉంది. ఒకరు సీఎం, మరొకరు ప్రతిపక్షనేత జగన్.. బీఏసీ సమావేశంలోనే.. అగ్లీ సీన్స్ చూడాల్సి వస్తుందని జగన్.. కామెంట్ చేయడంతో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించాడు.

డ్వాక్రా మహిళల రుణం అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా ఆరంభంలోనే అధికారపక్షాన్ని ఇరుకున పెట్టగలిగాడు. వాయిదా తీర్మానం సమయంలో చర్చకు అవకాశం ఇవ్వరు. కానీ ఆ సమయంలో జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీన్ని సాకుగా చూపి సభాపతి జగన్ ను మాట్లాడనీయలేదు. ఇదే విషయంపై సభ మూడు సార్లు వాయిదా పడింది. మొత్తానికి డ్వాక్రా మహిళలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్న వాదన వినిపించగలిగాడు.

ఇక రాష్ట్రంలో నెయ్యం, కేంద్రంలో కయ్యం అనే తరహాలో కొన్నాళ్లుగా సాగుతున్న టీడీపీ - బీజేపీ సంబంధాలను జగన్ అసెంబ్లీలో బాగానే ఎండగట్టగలిగాడు. దమ్ముంటే ముందు ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకొమ్మని మరోసారి సవాల్ విసిరాడు. ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుకుంటూ.. చక్కగా.. చిక్కగా నవ్వులు నవ్వుతారా.. అంటూ రెండు పార్టీలకు చురకలు వేశాడు.

చంద్రబాబు వైఎస్ అవినీతి గురించి ప్రస్తావించినప్పుడు కూడా జగన్ దీటుగానే స్పందించాడు. రెండెకరాల స్థాయి నుంచి ఎలా ఎదిగారో గుర్తు తెచ్చుకోవాలని ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. ప్రకాశం జిల్లా కొనకమిట్ల హత్య కేసు విషయంలో తన చిన్నాన్న కొడుకు అవినాష్ రెడ్డికి బురద అంటించే ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు. బాలకృష్ణ కాల్పుల ఘటనను వ్యూహాత్మకంగా ప్రస్తావించి టీడీపీకి వాయిస్ లేకుండా చేశాడు. ఓవరాల్ గా చూస్తే రెండో రోజు జగన్ మంచి మార్కులే కొట్టేశాడు. కానీ చీటికీ మాటికీ స్పీకర్ పై అరవడం కాస్త తగ్గించుకోవడం మంచిదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: