లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించే అంశంపై ఎన్డీయే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భూసేకరణ సవరణ బిల్లును లోక్‌సభ గతవారం ఆమోదించటం తెలిసిందే. లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభిస్తేనే చట్టరూపం ధరిస్తుంది. అయితే రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉండటంతో, లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లుకు అక్కడ ఆమోదం లభించదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించి ఓడించుకోవాలా? లేక రాజ్యసభకు పంపించకుండా వదిలేసి, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల పూరె్తైన తరువాత మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలా? అన్న అంశంపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం.

భూసేకరణ సవరణ బిల్లుకు కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాల మద్దతు సంపాదించేందుకు ఎన్డీయే చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి మాట్లాడి వచ్చారు. అయినా కాంగ్రెస్ వైఖరిలో మార్పు కనిపించకపోవటంతో ఎన్డీయే ప్రభుత్వాధినేతలు ఇరకాటంలో పడ్డారు. భూసేకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన వెంటనే వెంకయ్యనాయుడు పార్లమెంటు ఆవరణలోని తమ చాంబర్‌లో దాదాపు 35మంది మంత్రులతో సమావేశమై బిల్లుకు రాజ్యసభ ఆమోదం తీసుకునేందుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించారు.

కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వనంతకాలం భూసేకరణ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించటం దాదాపుగా అసాధ్యమని మంత్రులంతా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఆమోదం పొందిన భూసేకరణ సవరణ బిల్లును రాజ్యసభకు పంపించాలా? వద్దా? అనేది లోతుగా చర్చించారు. రాజ్యసభలో గెలిపించుకునే అవకాశం లేనప్పుడు దాన్ని అక్కడికి పంపించటమెందుకు? అనే అభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు. ఒక సభ ఆమోదించిన ప్రతి బిల్లు రెండో సభ ఆమోదం కొసం అటోమెటిక్‌గా వెళ్తుంది. ఇప్పుడు లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లు కూడా రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది.

అయితే ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యసభకు పంపించకుండా పెండింగ్‌లో పెట్టటం లేదా రాజ్యసభలో ఓడిపోతే పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోదముద్ర వేసుకోవటమా? లేక రాజ్యసభకు పంపించకుండా మురగపెట్టి పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేసి వారం పదిరోజుల అనంతరం పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేసుకోవటమా? లేక మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయటమా? అనేది పరిశీలిస్తున్నట్టు తెలిసింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అమోదించిన భూసేకరణ బిల్లును ప్రతిపాదిస్తే బలపరుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బిజెపి దీనికి ఇష్టపడటం లేదు. గతవారం లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లుకు ప్రభుత్వమే కొన్ని సవరణలు చేసినా కాంగ్రెస్ దిగిరావటం లేదు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే భూసేకరణ బిల్లును రాజ్యసభకు పంపించటం వృధా ప్రయాసే అవుతుందని పలువురు మంత్రులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: