ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం అనే అంశం అపసోపాల మధ్య నడుస్తోంది.కొత్త రాజధాని నిర్మాణం-భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక అనే అంశం ఏనాడు తెరమీదకు వచ్చిందో కానీ అప్పటి నుంచి దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొత్త రాజధాని కోసం భూ సేకరణ పెద్ద అడ్డంకిగా మారగా..ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు ఇబ్బందిపెట్టినా చంద్రబాబు ఆ గండాన్ని విజయవంతంగానే దాటుకొని వచ్చారని చెప్పవచ్చు.

ఇక రాజధాని నిర్మాణం..ఈ నిర్మాణం ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రభుత్వంలోనే ఒక స్పష్టత రావటం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. మొదట మలేషియా రాజధాని పుత్రజయ వలే ఉండాలని భావించారు. ఆ మేరకు కొన్నివార్తలు కూడా వచ్చాయి. అయితే అది ఎందుకో మూలన పడింది. ఆ తర్వాత జపాన్, జర్మనీల అదర్శంగా పరిపాలన కేంద్రం ఉండాలని అనుకున్నప్పటికీ అదీ పక్కకు జరిగింది. సింగపూర్ సంస్థ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అదే నమూనాలో దాన్ని మించిన కొత్త రాజధాని నిర్మించాలని ఖరారు చేశారు. అయితే ఇపుడు మరో దేశానికి చెందిన పరిపాలన రాజధాని డిజైను ఏపీ రాజధాని కోసం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈజిప్టు ప్రస్తుత రాజధాని కైరో ఇరుకుగా మారిందని, 2050 నాటి జనాభా అవసరాల మేరకు మరో నగరం నిర్మించాలని వారం కిందట అక్కడి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. రూ.2.5లక్షల కోట్లు ఖర్చుగా అంచనా వేసింది. భవిష్యత్తు అభివృద్ధి, నదీతీరంలో రాజధాని నిర్మాణం అనే కోణంలో ఈజిప్టు సర్కారు నిర్ణయం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఆ డిజైన్లు పరిశీలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఉన్నత వర్గాలు పేర్కొంటున్నాయి. 

సింగపూర్ ను మించిన రాజధాని ఉండాలనేది ఈజిప్టు ఆలోచన, కైరో సమీపంలోనూ జీవనది అయిన నైలూనది ఉండటం, ఏపీ కొత్తరాజధాని కి కృష్ణా అదే రీతిగా భరోసా ఉండటం, ప్రపంచస్థాయి నిర్మాణం, ఆర్థిక కార్యకలపాలకు వేదికగా ఉండాలనే కోరిక, స్మార్ట్ సిటీగా వెలసిల్లుతూ జీవన ప్రమాణాలు పెంచడం తదితరాలు ఈజిప్టు పరిపాలన రాజధాని నిర్మాణ లక్ష్యం అయిన నేపథ్యంలో ఏపీ రాజధాని సైతం అదే ప్రమాణాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

కొసమెరుపు: ఏపీ ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం బాగానే ఉన్నప్పటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న ఎదురువుతోంది.సర్కారు ఇప్పటికే లోటు ఖజానాలో ఉన్ననేపథ్యంలో ఇంత పెద్ద లక్ష్యానికి ఎక్కడినుంచి వనరులు సమకూరుతాయి? కేంద్రం మొండిచేయి చూపిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఈ సొమ్మును ఎక్కడి నుంచి సమకూరుస్తారో మరి?


మరింత సమాచారం తెలుసుకోండి: