ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ మునుపెన్నడూ లేని స్థాయిలో హవా చెలాయిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో టీడీపీ జోరుపై విమర్శలు చెలరేగుతుండగా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత మచ్చ తెచ్చాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ అడ్డగోలుగా వ్యవహరించిందన్న అప్రతిష్ఠ మూటగట్టుకుంది. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు ఇతర ప్రజాప్రతినిధులంతా చట్టాన్ని ఉల్లఘించారు. కృష్ణా-గుంటూరు ఉపాధ్యయ ఎమ్మెల్సీ నియోజకవర్గం అభ్యర్థి ఏ.ఎస్‌ రామకృష్ణ తన అనుచరులతో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీకి దిగడం.... విజయవాడలో సీపీఎం నేతలు అడ్డుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. మరోవైపు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబులు పోలింగ్ కేంద్రాలకు సమీపంలోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం కూడా వివాదాస్పదమైంది. వారి ప్రయత్నాన్ని యూటీఎఫ్ అడ్డుకుంది. దీంతో బాధ్యతాయుతమైన మంత్రులు ఎన్నికల్లో ఇలాగే వ్యవహరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.


కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందినమంత్రులు ఎమ్మెల్యేలు గత రెండురోజులనుండి పూర్తిగా డబ్బు పంపిణీపైనే దృష్టి సారించారు. గుంటూరు శాసనసభ్యుడు మోదుగుల వేణు గోపాలరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఓ యూనియన్‌ నాయకుడుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి కె.లక్ష్మణరావుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. గుంటూరులో మంత్రి పుల్లారావు తన అనుచరులతో నేరుగా పోలింగ్‌ బూత్‌కి వెళ్ళారు. మంత్రి రావెల కిషోర్‌ కూడా ఓ పోలింగ్ బూత్‌లో కూర్చున్నారు. మొత్తానికి టీడీపీ అసెంబ్లీలోనూ, బయట దూకుడు చూపుతోందని... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని... అధికారం చెలాయించడంలో మంత్రులు సహా పార్టీ వర్గాలన్నీ తొందరపడుతున్నాయన్న విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.


గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో కానీ, విపక్షంలో ఉన్నప్పుడు కానీ టీడీపీ విధానంలో ఇలాంటి ధోరణి ఎప్పుడూ లేదు. కొందరు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడైనా అనవసర దూకుడు చూపినా అప్రతిష్ఠ వస్తుందన్న ఉద్దేశంతో పార్టీపరంగా వారిని వారించడమో.. కట్టడి చేయడమో ఉండేది. కానీ తాజాగా వారు వీరు అన్న తేడా లేకుండా మంత్రుల నుంచి చిన్నచిన్న నాయకుల వరకు అంతా ఇదే జోరు చూపిస్తున్నా పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు ఉండడం లేదు. పైగా అసెంబ్లీలో స్వయంగా సీఎం చంద్రబాబు ఎదుటే టీడీపీ నాయకులు దురుసుతనం ప్రదర్శిస్తున్నా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దూకుడు పెంచాలని... అటాకింగ్ విధానం అనుసరించాలని చంద్రబాబు కూడా సూచిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ తీరు మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
===========


మరింత సమాచారం తెలుసుకోండి: