అసెంబ్లీలు వివాదాలకు, గందరగోళానికి... అప్రజాస్వామిక విధానాలకు వేదికవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శాసనసభ సమావేశాలు వివాదాలకు నెలవుగా మారాయి. ప్రజా సమస్యలు చర్చ జరగాల్సిన సభలో వ్యక్తిగత దూషణలు, హెచ్చరికలతోనే సరిపోతుంది. సాధారణంగా శాసనసభ సమావేశాలు జరిగితే సాధారణంగా అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపలు, ఒకరినొకరు నిందించుకోవడం చేసుకోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. కానీ తాజా సమావేశాల్లో స్పీకర్లే వివాదాస్పదులవుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ కోడెల శివప్రసాద రావుపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాసం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గురువారం వరకు స్పీకర్‌ వర్సెస్‌ ప్రతిపక్షం అన్నట్లుగా సాగింది. రైతు సమస్యలను, రుణమాపీ, రాజధాని అంశాలను అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరుకున పెడుతుందని, ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై అధికారపక్షం ఎలా సమాధానమిస్తుందో విందామని అందరూ భావించారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలను మధ్య ఏర్పడాల్సిన వివాదం, స్పీకర్‌కు, ప్రతిపక్షానికి మధ్య ఏర్పడినట్లు కనిపిస్తోంది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రారంభమైన ఈ వివాదం బడ్జెట్‌పై చర్చ జరిగే సమయానికి చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు వైకాపా స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే దశకు చేరుకుంది. 

ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం, మంత్రులు, తెదేపా శాసనసభ్యులు మాట్లా డేందుకు అవకాశం ఇవ్వడంతో విపక్ష సభ్యులు స్పీకర్‌పై గుర్రుగా ఉన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్న వారికి పదే పదే అవకాశం కల్పించడం, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్‌ అభ్యంతరం చెప్పడం, ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాన్ని మాట్లాడుతున్న సందర్భంలో మీరు అలా మాట్లాడకూడదని ఆక్షేపించడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ స్పీకర్‌ వైఖరిని వైకాపా తప్పుపడుతోంది.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్‌ ఇవ్వాలని తెదేపా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయగీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేంత వరకు అసెంబ్లీ  నుంచి తెదేపా సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌పై 23వ తేదీన అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు తెదేపా సమాయత్తమవు తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: