భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మతమార్పిడిలపై రచ్చ.. చర్చ మొదలైంది. కమలం పార్టీకి దగ్గరగా ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్లు ఇతర కాషాయధారులకు కొత్త స్వతంత్రం వచ్చింది. హిందూ వాహిని వంటి సంస్థలు 'ఘర్ వాపసీ' అంటూ ముస్లింలను, క్రిస్టియన్లను హిందూమతంలోకి తీసుకొచ్చే ప్రక్రియలను మొదలు పెట్టారు. దీనిపై మైనారిటీ పక్షం నిలిచే కాంగ్రెస్ వంటి పార్టీలు తెగ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరించింది.

అయితే ఇదే సమయంలో కొంతమంది కాషాయధారులు తమ నోటికి పని చెప్పారు. దేశాన్ని హిందుత్వమయం చేస్తాం.. భారతదేశంలో లౌకికవాద దేశం కాదు.. ఇండియా హిందువులదేనని వ్యాఖ్యానించసాగారు. వీరంతా అధికార పార్టీకి దగ్గరకవారు కావడంతో ఈ మాటలన్నీ మోడీ సర్కారుకు కొంత ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం అపురూపంగా భావించిన అమెరికా అధ్యక్షుడు కూడా ఇండియాలో మతస్వేచ్ఛ విషయంలో కొన్ని ఘాటైన వ్యాఖ్యానాలు చేశాడు. ఆ తర్వాత మోడీ సర్కారు కూడా కొంత లౌకిక వాద ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించింది.

 అయితే తాజాగా కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యవహారాన్ని కొత్త మలుపుతిప్పాడు. మత మార్పిడిల తీరును ఖండిస్తున్నట్టుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ మాటలు అసలైన హిందుత్వవాదివిలా ఉన్నాయి. ఇదే సమయంలో అర్థవంతంగానూ ఉన్నాయి! గ్రామీణ ప్రాంతాల్లో, దళితులకు ఇతర వెనుకబడిన వర్గాలకు సేవ చేస్తున్నామనే భావనను కలిగిస్తూ..కొన్ని స్వచ్ఛంద సంస్థలు మత మార్పిడిలకు పాల్పడుతున్నాయనేది దాస్తే దాగే విషయం కాదు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు రాజ్ నాథ్.

'మతమార్పిడిలు లేకుండా సేవ చేయలేమా? సేవ చేయాలనుకొనే వాళ్లు మత మార్పిడిలకు పాల్పడకుండా ఆ పని చేయాలి.. ' అని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్ సింగ్ దేశంలో మతమార్పిడి అంశం గురించి చర్చ జరగాలని ఆకాంక్షించారు. చాలా దేశాల్లో మైనారిటీలే మత మార్పిడిని నిరోధక చట్టాన్ని కోరుకొంటున్నారని.. మన దేశంలో కూడా ఈ అంశంపై సమాలోచనలు జరగాలని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. మరి కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులిగారి షుగర్ కోటెడ్ హిందుత్వ వాదం బాగానే ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ను వ్యవస్థకు నరాల్లోకి జొప్పించగలరా?! 


మరింత సమాచారం తెలుసుకోండి: