నాయకుడంటే ఎలా ఉండాలి. కంటి చూపుతో అనుచరుల్ని కంట్రోల్ చేయగలగాలి. నోరు తెరచి చెప్పకుండానే అధినేత మనసులో మాట అనుచరులు గ్రహించగలగాలి. అధినేత పట్ల భయం, భక్తీ రెండూ సమపాళ్లలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ నాయకుడి సారథ్యం గొప్పగా ఉన్నట్టు. 


మరి జగన్ అలాగే ఉంటున్నారా..? క్యాడర్ ను సరిగ్గా కంట్రోల్ చేయగలుగుతున్నారా..? పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు కలిగి ఉన్నారా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. జగన్ కు ఇగోయిస్టుగా పేరుంది. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్నరీతిలో ఉంటారని చెబుతుంటారు. చెప్పడమే తప్ప పెద్దగా వినడం ఆయనకు అలవాటు లేదంటారు. 

మరి అలాంటి జగన్ అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలను సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. టీడీపీ సభ్యులు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ వినిపించడం వైసీపీ సభ్యులకు అలవాటుగా మారింది. జగన్ ఆ అలవాటును మాన్పించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

మంగళవారం అసెంబ్లీలో విద్యుత్ చార్జీల అంశంపై ప్రసంగించిన జగన్.. ప్రసంగం చివర్లో వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వాకౌట్ చేశారు. ఆ తర్వాత ప్రసంగించిన టీడీపీ నేతలు.. జగన్ ఎందుకు వాకౌట్ చేశాడో అర్థం కాలేదని విమర్శించారు. బహుశా.. జగన్ ప్రసంగానికి టీడీపీ సమాధానం చెప్పే సమయంలో తన వాళ్లను కంట్రోల్ చేయడం కష్టమని.. అందుకే అభాసుపాలుకాకుండా తానే ముందుగా వాకౌట్ చేస్తున్నాడని విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: