కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓటమికి కారణాలేంటో చెప్పమంటే.. ఒకటి రెండు కాదు ఎన్నో ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో వర్షం పడ్డప్పుడే ఏదో తేడా జరగబోతోందని చాలామందికి డౌట్ కొట్టింది. చివరికి ఓటమికి అది కూడా ఓ కారణం అని ఆ దేశ అభిమానులు నమ్ముతున్నారు. ఆటగాళ్ల చేతుల్లో లేని ఇలాంటి అంశాల గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు.


ఐతే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చేజేతులా క్యాచ్‌లు, రనౌట్లు వదిలేయడం మాత్రం క్షమార్హం కాని తప్పులు. ఫీల్డింగ్‌లో ప్రపంచ నెంబర్‌వన్ జట్టు ఇలా తప్పుల మీద తప్పులు చేయడాన్ని బట్టి వాళ్లు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. డివిలియర్స్ లాంటి వాడు సులభమైన రనౌట్ వదిలేయడం ఏంటి? మంచి ఫీల్డరైన బెహార్డియన్ క్యాచ్ చేజార్చడమేంటి? ఇదంతా దురదృష్టాన్ని జేబులో పెట్టుకుని బరిలోకి దిగే దక్షిణాఫ్రికా తలరాత అనుకోవాలి.


ఇవన్నీ పక్కనబెడితే.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చింతించడానికి ఇంకో పెద్ద కారణం కనిపిస్తోంది. సెమీఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కివీస్‌ను ఫైనల్‌కు చేర్చిన గ్రాంట్ ఇలియట్ దక్షిణాఫ్రికా వాడే. అతను పుట్టింది జొహానెస్‌బర్గ్‌లోనే. అతడి తండ్రి అక్కడే ప్లాస్టిక్ సర్జన్‌గా పని చేశాడు. 2001 వరకు దక్షిణాఫ్రికాలోనే క్రికెట్ ఆడాడు ఇలియట్. అక్కడే దేశవాళీ మ్యాచ్‌ల్లోనూ పాల్గొన్నాడు.


కానీ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కెన్ రూథర్‌ఫర్డ్ ఓసారి ఇలియట్ ఆట చూసి.. తమ దేశానికి వచ్చేయమన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో తెల్లవాళ్లు, నల్లవాళ్లకు కోటాలు ఉంటాయని.. ఇక్కడ జట్టులో చోటు సంపాదించడం కష్టమని చెప్పడంతో అతడి మాట విని న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు ఇలియట్. 2007లో కివీస్ జాతీయ జట్టుకు ఆడే అర్హత సాధించిన ఇలియట్.. తర్వాతి ఏడాదే టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఈ ఏడెనిమిదేళ్లలో పెద్దగా పేరు రాకపోయినా.. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్లోనే అతి గొప్ప విజయాన్నందించి తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. ఐతే తమ వాడే తమను ఓడించాడని తెలిసిన దక్షిణాఫ్రికా అభిమానులు బాధ మాత్రం వర్ణనాతీతం.


మరింత సమాచారం తెలుసుకోండి: