ప్రజాసేవ చేసేవారికే ఎన్నికల టికెట్లు ఇచ్చే సాంప్రదాయం పోయి చాలాకాలమైంది. కులబలం, కండబలానికి తోడు ధనబలం కూడా ఉన్న వారికే ఇప్పుడు టికెట్లు దక్కుతున్నాయి. హై కమాండ్ లో కాస్త పరపతి ఉంటే చాలు.. మీకు టికెట్లిప్పిచ్చేస్తామని ఆశావహుల దగ్గర లక్షలకు లక్షలు వసూలు చేయడం ఇప్పుడు కామనైపోయింది. 

ఖమ్మం జిల్లాలోనూ గత ఎన్నికల్లో అలాంటి వ్యవహారమే జరిగింది. కాకపోతే అది బెడిసి కొట్టి ఇప్పుడు రచ్చ.. రంబోలా అవుతోంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి.. గత ఎన్నికల్లో రాంజీ అనే గిరిజన వ్యక్తికి టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికారట. ఏకంగా కోటి రూపాయలు సమర్పించుకున్నారట. కానీ టికెట్ రానేలేదు. 

ఎన్నికలు మాత్రం అయ్యాయి. తీరా రేణుకాను డబ్బు వెనక్కిమ్మని అడిగేసరికి.. ఆమె ఇవ్వడం లేదని.. ఆ బెంగతోనే తన భర్త చనిపోయాడని ఇప్పుడు రాంజీ అనే వ్యక్తి భార్య కళావతి నానా గొడవ చేస్తోంది.  ఇక లాభం లేదనుకుని ఏకంగా రేణుకపై కేసు కూడా పెట్టేసింది. 

కోర్టుల్లో కేసులంటే ఇప్పట్లో తేలేవి కాదు కదా.. అందుకే కడుపు మంట తీరక.. రేణుక అనుచరులపైనా కళావతి ప్రతాపం చూపుతోంది. బుధవారం రేణుకా చౌదరి అనుచరుడు సైదులు నాయక్ మీడియా సమావేశం పెడుతున్న సమయంలో అక్కడకు వెళ్లిన కళావతి నానా హంగామా మాచేసింది. సైదులుపై ఏకంగా చెప్పుతో దాడి చేసింది. బండబూతులు తిడుతూ.. చెప్పులు మీదకు విసిరేసింది. తన డబ్బు సంగతేమిటని అడిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా.. రేణుక ఈ వ్యవహారాన్ని త్వరగా సెటిల్ చేసుకుంటే బెటర్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: