నందమూరి తారక రామారావు. ఆంధ్రులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మహనీయుడీయన.. మరి ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన పేరు దేనికైనా పెట్టారా అంటే మాత్రం సమాధానం వినిపించదు. శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టినా.. దాన్ని ఎవరూ పెద్దగా వాడరు. దాని వల్ల ప్రయోజనం శూన్యం. 


కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. కానీ కృష్ణానది ద్వారా వచ్చిన పేరు తీసేయడం కూడా బావుండదన్న కారణంతో అది ఆచరణకు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడతారని నిన్న మొన్నటి వరకూ టాక్ వచ్చింది. తారకరామనగర్, ఎన్టీఆర్ నగర్ వంటి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. 

కానీ.. ఇప్పుడు ప్రభుత్వం అమరావతి అన్న పేరుకే ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ పేరు ఇక దేనికి పెడతారు. కొత్త రాజధానిలో సచివాలయానికో, అసెంబ్లీకో ఎన్టీఆర్ పేరు పెట్టినా.. అది ఆయన స్థాయికి తగిన గుర్తింపు కాదు. మరి ఏంచేయాలి.. ఎన్టీఆర్ పేరు ఎలా వాడుకోవాలి..? ఈ ప్రశ్నలకు సమాధానం బుధవారం నాటి అసెంబ్లీ లాబీల్లో దొరికింది. రాజధాని ప్రాంతాన్ని ఓ జిల్లా చేసి దానికి  ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న సూచనలు పలువురు సభ్యుల నుంచి వచ్చాయి. 

రాజధానికి ఎన్టీఆర్ పేరు అంతగా బావుండదని.. కానీ జిల్లాకయితే బావుంటుందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రకాశం, వైఎస్సార్, పొట్టి శ్రీరాములు జిల్లాలు ఉన్నాయి కాబట్టి రాజధాని జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల ఎవరికీ అభ్యంతరాలు కూడా ఉండవని సభ్యులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముందుకుతెస్తే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కుటుంబరావు సమర్థించారు. సో.. రాజధాని జిల్లాకు ఎన్టీఆర్ పేరు దాదాపు ఖాయం అయినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: