సింగపూర్‌ వ్యవస్థాపక ప్రధాని లీ కున్‌ యూ కు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటన విషయం సిఎం, ప్రధానమంత్రి కార్యాలయాల మధ్య వివాదంగా మారింది. పర్యటనకు అనుమతి రాకపోవడంతో ఒక దశలో ముఖ్యమంత్రి తన పర్యటనను రద్దు చేసుకోవాలని భావించారు. సిఎం సింగపూర్‌ పర్యటన కేంద్రంగా బుధవారం పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై స్పందించారని సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని సిఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌ వ్యవస్థాపక ప్రధానికి నివాళులర్పించడానికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లాలని భావించిన సంగతి తెలిసిందే.

లీ కున్‌యూ మృతికి శాసనసభలో రెండురోజుల క్రితం స్వయంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు. సిఎం కార్యాలయ వర్గాలు ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం రాత్రి సిఎం సింగపూర్‌కు బయలుదేరాల్సి ఉంది. గురువారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేలా పర్యటన షెడ్యూల్‌ను సిఎంఒ ఖరారు చేసింది. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ రాజకీయ అనుమతిని ఇవ్వాల్సి ఉండటంతో ఈ మేరకు ప్రతిపాదనను మంగళవారమే అక్కడకు పంపారు. సాధారణంగా వెంటనే అనుమతిచ్చే విదేశాంగ శాఖ దానికి భిన్నంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఫైలును ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ శాఖ అధికారులు పంపారు. బుధవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న సిఎంఒ అధికారులు ప్రధాని కార్యాలయానికి ఎందుకు పంపారని విదేశాంగశాఖ అధికారులను అడిగినట్లు తెలిసింది. ప్రధానమంత్రి పర్యటన కూడా అదేరోజు ఉండటంతో గందరగోళం తలెత్తకూడదని అక్కడి పంపామని వారు సమాధానం ఇచ్చారు.

దీంతో రాష్ట్ర అధికారులు పిఎంఒకు పదేపదే ఫోన్లు చేసినట్లు తెలిసింది. సిఎంఒ నుంచి వస్తున్న ఒత్తిడితో ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి కూడా అక్కడి అధికారులు తీసుకువెళ్లినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 'నేను వెళ్తున్నా... నాతో రావచ్చుగదా...' అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అంత సానుకూలంగా స్పందించలేదని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి సింగపూర్‌ పర్యటన దాదాపుగా రద్దయిందనే భావించారు. ఆ తరువాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారమూ లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని సిఎం కార్యాలయ వర్గాలు వ్యక్తం చేశాయి. ఒక దశలో అనుమతి ఇచ్చామని చెప్పిన పిఎంఒ అధికారులు ఆ మేరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులను పంపలేదు. దీంతో రకరకాల వ్యాఖ్యలు వినవచ్చాయి. చివకు ప్రధాని అధ్యక్షతన సింగపూర్‌కు ఒక బృందం వెళితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు పిఎంఒ నుంచి సమాచారం అందింది. దీంతో ముఖ్యమంత్రి సింగపూర్‌ పర్యటలో మార్పులు ఉంటాయని సిఎం కార్యాలయ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: