నిన్న మొన్నటివరకూ ఆంధ్రా అసెంబ్లీలో పులుల్లా రెచ్చిపోయిన వారంతా.. ఒక్కసారిగా పిల్లుల్లా మారిపోయారు. ఆవేశకావేశాల... పంచ్ డైలాగులు, రన్నింగ్ కామెంటరీలు.. పోడియం వద్ద నినాదాలు.. ఇలా అధికార పార్టీని హడలెత్తించిన వారంతా గురువారం ఒక్కొక్కరుగా స్పీకర్ కు క్షమాపణలు చెప్పేశారు. తెలిసో తెలియకో అలా చేశామని చెప్పుకొచ్చారు. 

ఎందుకు ఇంతలోనే అంతమార్పు ఎందుకొచ్చింది. నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారా.. ఒక్కసారిగా బుద్దిమంతులైపోయారా.. అంటే కానే కాదు.. మరి ఎందుకలా వైసీపీ ఎమ్మెల్యేలు తలవంచేశారు.. దీనికి ప్రధాన కారణం స్పీకర్ అధికారాలు.. విచక్షణ పేరుతో సభాపతి స్థానానికి ఉన్న హక్కులు- విశేష అధికారాలు.

సభలో సారీ చెప్పకపోతే.. 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. సభాపతి తనకున్న విశిష్ట అధికారంతో ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యైనా తీసుకోవచ్చు.. దాన్ని ఉపయోగించుకుని రెండు మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తే.. ఎమ్మెల్యేలు చిక్కుల్లో పడతారు. అసలే యాక్టివ్ గా ఉన్నవారంతా సస్పెన్షన్ కు గురైతే.. అది వైసీపీకి పెద్ద దెబ్బే అవుతుంది. 

గతంలోనూ స్పీకర్ ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్.. సభ వెలుపల స్పీకర్ గురించి కామెంట్ చేశారు. అప్పటి స్పీకర్ ఆయనపై కొన్నాళ్లు సస్పెన్షన్ వేటు వేశారు. సభ వెలుపల మాట్లాడితేనే అంతటి యాక్షన్ తీసుకున్నప్పుడు.. ఏకంగా సభలో దుష్ప్రవర్తనకు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దానికంటే ఓసారి సారి చెప్పేస్తేనే బెటరనే నిర్ణయానికి వైసీపీ వచ్చేసింది. సారీల పర్వం కానిచ్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: