ఎంతటి మహానేతకైనా అడపాదడపా ఎదురుదెబ్బలు తప్పవు.. సార్వత్రిక ఎన్నికలతో ఒక్కసారిగా ఎగసిన మోడీ తేజం.. అదే ఊపు కొన్నాళ్లు కొనసాగించారు. కానీ.. ఢిల్లీ ఎన్నికలు ఆయన ప్రతిష్టను కాస్త మసకబార్చాయి. ఢిల్లీ ఎన్నికల ఘోర పరాజయంతో మోడీ క్రేజ్ కాస్త తగ్గింది.

ఐతే.. ఇంటర్నేషనల్ గా మాత్రం మోడీ మేనియా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ పత్రికలు ఇంకా మోడీకి టాప్ పొజిషన్ కట్టబెడుతూనే ఉన్నాయి. గతంలో ఆసియన్ నెంబర్ వన్, టైమ్స్ మేగజైన్ వంటి ప్రతిష్టాత్మక విజయాలు తన ఖాతాలో వేసుకున్న ఈ గడ్డం నేత మరోసారి టాప్ పొజిషన్ దక్కించుకున్నారు.  

మన ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఫార్చ్యూన్ మేగజైన్  ప్రకటించిన 50 మంది ప్రపంచ అత్యుత్తమ నాయకుల్లో మోడీకు ప్లేస్ దక్కింది. అందులోనూ టాప్ టెన్ లో చోటు దక్కించుకుని తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఆపిల్  అధినేత టిమ్ కుక్  ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. 

మన మోడీ ఐదో స్థానంలో నిలవగా.. మనదేశానికే చెందిన నోబెల్  శాంతి బహుమతి గ్రహీత కైలాష్  సత్యార్థి 28 స్థానం సొంతం చేసుకున్నారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తూనే.. భారత్ ను టాప్ ప్లేస్ లో నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారని ఆ పత్రిక కామెంట్ చేసింది. ప్రత్యేకించి ఆయన దౌత్య నీతిని ప్రశంసించింది. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈ జాబితాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాకు చోటే దక్కలేదు. ఇలా ఒబామా జీరో కావడం ఇది వరుసగా రెండోసారి. 



మరింత సమాచారం తెలుసుకోండి: