అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జగన్ మరోసారి చారిత్రక తప్పిదనం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశాల మొదట్లో జగన్.. సభలో చక్కటి దూకుడు ప్రదర్శించారు. అధికారపక్షం తప్పులను ఎత్తి చూపేందుకు ఎందాకైనా వెనుకాడబోమన్న సంకేతాలు పంపారు. సభలో తొలివారం రోజులు వైసీపీ హవాయే నడిచింది. జగన్ కూడా గతంలోనూ ఏదో ఒకటి మాట్లాడటం కాకుండా.. డ్వాక్రారుణాలు, అంగన్ వాడీలు, నిరుద్యోగులు, రుణమాఫీ, రాజధాని రైతులు.. ఇలా ప్రతి అంశంపైనా కసరత్తు చేసే ప్రసంగాలు రూపొందించుకుని చక్కగా మాట్లాడారు. 

ప్రత్యేకించి బడ్జెట్ పై ఆయన చేసిన ప్రసంగం విమర్శకుల ప్రసంసలు అందుకుంది. స్పీకర్ సస్పెన్షన్ ను సైతం ధిక్కరిస్తూ బడ్జెట్ పై ప్రతిపక్షనేత ప్రసంగాన్ని అసెంబ్లీలో కాకుండా పార్టీ కార్యాలయం నుంచి చేయడం వరకూ జగన్ సరైన పంథాలోనే వెళ్లారు. సస్పెన్షన్ ఘటన తర్వాత ఆయన ఒక్కసారిగా అధికారపక్షానికి సరెండర్ కావడం, బేషరుతుగా క్షమాపణ చెప్పడంతో అప్పటివరకూ వచ్చిన క్రెడిట్ కాస్తా గంగపాలైంది. 

ఎమ్మెల్యే బహిష్కరణకు భయపడి జగన్ ఇలా చేశారని అనుకున్నా.. జగన్ అందులో అంత భయపడాల్సిన విషయం ఏముందన్నది అంతుబట్టని విషయంగా మారింది. జగన్ నిర్ణయాన్ని చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులే తప్పుబడుతున్నారు. సస్పెండ్ అయితే పోయేదేముంది.. మహా అయితే ఓ ఏడాదో, రెండేళ్లో బహిష్కరణ వేటు వేస్తారు. అందువల్ల వచ్చిన నష్టం ఏముంటుంది.. ఒక వేళ అలా చేసినా.. ప్రజల వద్దకు వెళ్లి వివరించే అవకాశం ఉండేది. 

ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడుతుంటే.. అధికారపక్షం కక్షకడుతోందంటూ ప్రజామద్దతు కూడగట్టుకునే అవకాశం ఉండేది. ప్రతిపక్షంగా అది పార్టీకి మేలు చేసేదే కానీ.. కీడు చేసేది కాదు.. ప్రజల్లోకి వెళ్లకుండా.. అధికారపక్షంతో రాజీ పడి.. నిండు సభలో తాను.. తనతో పాటు మరో 9 మంది సభ్యులు క్షమాపణలు చెప్పడం ద్వారా.. పార్టీ గ్రాఫ్ ప్రజల్లో ఒక్కసారిగా పడిపోయిందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జగన్ కు జనంలో ఉన్న రెబల్ ఇమేజ్ కూడా క్షమాపణతో మట్టిగొట్టుకుపోయిందని వారు భావిస్తున్నారు.  మరి జగన్ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా.. చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: