భారత రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు బహు అరుదు. అవినీతి, కీర్తి కండూతి, పదవీకాంక్ష, బంధుప్రీతి.. రాజకీయం అత్యంత సహజ లక్షణాలుగా మారిపోయిన మన దేశ బురద రాజకీయాల్లో వికసించిన అపూరూప కమలం ఆయన. జీవితాంతం నమ్మిన విలువల కోసం బతికిన మహా నేత. రాజకీయాలతో పాటు.. సాహిత్యాభిలాష.. కలిగిన అతికొద్ది మంది ఆణిముత్యాల్లో ఆయనా ఒకరు. ఆయనే అటల్ బిహార్ వాజ్ పేయి..  

ప్రభుత్వాలు మారినప్పుడు తమ అనుకూలురకు అవార్డులు ఇచ్చుకోవడం ఇప్పుడు మామూలైపోయింది. అటల్ జీకు దక్కిన ఈ భారత రత్నను కూడా ఆ కోవలో కట్టేయడానికి వీల్లేదు. బీజేపీ అధికారంలో ఉండటం వల్ల భారతరత్న కాస్త ముందుగానే వచ్చిందని అనుకుంటే అనుకోవచ్చు గానీ.. భారతరత్నపురస్కారానికి నూటికి రెండోందల శాతం అర్హుడైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. 

అటల్ బిహారీ వాజ్‌పేయి.. 1926 డిసెంబరు 25న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా సమీప గ్రామం బదేశ్వర్‌లో జన్మించారు. తండ్రి సంస్కృత పండితుడు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం కోసం తపించే వాజ్ పేయి.. RSSలో చేరారు. అప్పట్లో క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 

స్వాతంత్ర్యానంతరం RSS పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు.  1951లోజన్‌సంఘ్‌ లో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1953లో 31 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1968లో జన సంఘ్ అధ్యక్షుడయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో జన్‌సంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర సర్కారు ఆగడాలపై గళమెత్తారు. 1977లో మొరార్జీదేశాయ్‌ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

జనతా ప్రభుత్వం పతనం తర్వాత అద్వానీతో కలసి 1980లో బీజేపీకి ప్రాణం పోశారు. 1984లో కేవలం 2 స్థానాలతో పార్లమెంట్ లో ఉన్న బీజేపీ.. 1996లో మైనారిటీ సర్కారు ప్రధాని ప్రమాణస్వీకారం చేసే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. 1998 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రెండోసారి ప్రధాని అయ్యారు. జయలలిత రాజకీయంతో ఈసారి 13 నెలలకే అధికారం కోల్పోయారు వాజ్ పేయి.  1999 ఎన్నికల్లో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి... ఇందిరాగాంధీ తర్వాత ప్రధానిగా మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 

సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్ పేయి విజయవంతంగా నడిపించారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేశారు. టెలికామ్‌, పౌరవిమానయాన రంగం, బ్యాంకింగ్‌, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యం-పెట్టుబడులు, పన్నులు, విద్యుత్‌, పెట్రోల్‌ ధరలు వంటి.. అనేక అంశాల్లో సంస్కరణలు అమలు చేశారు. వృద్ధిరేటు 8 శాతానికి తీసుకెళ్లారు. 1998 లో అణు పరీక్షలు చేపట్టి.. భారత్ సత్తా చాటారు. 

వాజ్‌పేయి మంచి ప్రధాని, సంకీర్ణ నేత మాత్రమే కాదు.. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌. ఆయన్ను వరించి వచ్చిన పురస్కారాలెన్నో.. గోవింద్‌ వల్లభ్‌పంత్‌ అవార్డును కూడా అటల్  అందుకున్నారు అటల్‌జీ. 1992లో పద్మవిభూషణ్‌, 1993లో గౌరవ డాక్టరేట్‌, 1994లో లోకమాన్య తిలక్‌ పురస్కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. జీవిత చరమాంకంలో భారత రత్నతో ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: