రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణ మాఫీ వ్యవహారం బ్యాంకులను గట్టి దెబ్బ తీసిందని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మాఫీ పథకం కారణంగా బ్యాంకులకు రైతులు రుణాలు చెల్లించడం లేదని, రెన్యూవల్ కూడా చేయించుకోవడం లేదని, దీనివల్ల బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ, బకాయిలు పేరుకుపోతున్నాయని ఆంధ్రాబ్యాంకు సిఎండి, రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ అధ్యక్షుడు సివిఆర్ రాజేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేయించుకునే విధంగా ఉధృత ప్రచారం చేయాలని కోరారు. రుణమాఫీ వల్ల బ్యాంకుల్లో నిధుల ప్రవాహం తగ్గిందని, లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. మరో మూడు రోజుల్లో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రైతులు రుణాలను చెల్లించాలని, రెన్యూవల్ చేయించుకోవాలన్నారు.

శుక్రవారం ఇక్కడ ఆంధ్రాబ్యాంకులో 189వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. సమావేశంలో రాష్టమ్రంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉప చైర్మన్ కుటుంబరావు హాజరయ్యారు. ఎస్‌ఎల్‌బిసి ప్రకటించిన వివరాల ప్రకారం 2014-15లో రూ.56019 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం రూ. 22433 కోట్లు మంజూరు చేశారు. ఖరీఫ్‌లో 32909 కోట్లకుగాను 13789 కోట్లు, రబీలో 23110 కోట్లకుగాను 8654 కోట్ల రుణాలు మంజూరు చేశారు. మొత్తం అన్ని బ్యాంకుల్లో 115 లక్షల అకౌంట్లలో వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలు అవుట్ స్టాండింగ్ 97915 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో బకాయిలు 33325 కోట్లు, ఎన్‌పిఏలు 5780 కోట్లకు చేరుకున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో రైతులు రుణాలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని బ్యాంకు సిఎండి రాజేంద్రన్ అన్నారు. రైతులు రుణాలు చెల్లించకపోవడంతో, పంపిణీపై పెను ప్రభావం చూపిందన్నారు.

వార్షిక ప్రణాళికలో నిర్దేశించినట్టుగా రుణాలు పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా రైతులు రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. గతంలో స్వయం సహాయక బృందాల ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేదని, రుణమాఫీ తర్వాత ఈ కేటగిరీలో ఎన్‌పిఏ విపరీతంగా పెరిగిందన్నారు. గ్రూపునకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇంతవరకు మార్గదర్శకాలు జారీ కాలేదన్నారు.రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు 4680 కోట్లను మొదటి విడత కింద మంజూరు చేసిందన్నారు. రెండో విడతగా 2315 కోట్లు బ్యాంకు అకౌంట్లకు వేసిందన్నారు. అర్హులైన రైతులకు రుణాల మంజూరు చేస్తున్నామని, మిగిలిన రుణాలకు రైతులు రెన్యూవల్ చేయించుకోవాలని ప్రచారం చేస్తున్నామన్నారు. దాదాపు 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ వల్ల ప్రయోజనం చేకూరిందన్నారు.

కొన్ని సమస్యల వల్ల మాఫీ పథకం అమలులో జాప్యమవుతోందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగాలేకపోయినా, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. అర్హులైన కౌలు రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తామన్నారు. ప్రణాళిక సంఘం ఉప చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ వ్యవసాయ ఎన్‌పిఏల కంటే కార్పోరేట్ రంగం పరిశ్రమల ఎన్‌పిఏలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. బ్యాంకర్ల ప్రకటనలను విపక్షపార్టీలు తప్పుగా అర్థం చేసుకుని ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారన్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ సామాజిక వెనకబడిన వర్గాలు, దళితులకు రుణాలు ఇవ్వాలన్నారు. అన్ని వర్గాల్లో అర్హులైన వారికి పరిశ్రమల స్థాపనకు రుణాలివ్వాలన్నారు. రుణమాఫీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బ్యాంకులు రుణ మాఫీ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: