తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యేల బలాబలాల గురించి స్పీకర్ అధికారికంగా విడుదల చేసిన జాబితాను చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఈ జాబితాను బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ అభిప్రాయం కూడా ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది. ఫిరాయింపు దారులైన ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటూ వేసే ఉద్దేశం కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు! ఇప్పటి వరకూ అసలు ఫిరాయింపు దారులను గుర్తించనే లేదు కూడా.


మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఫిరాయింపులకు పాల్పడ్డారు. తెలంగాణలో అధికారం సాధించుకొన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. చట్ట ప్రకారం ఇలాంటి ఫిరాయింపు దారులకు అనర్హత వేటు పడాలి. అందులోనూ ఇలా ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే ఒకరికి కేసీఆర్ మంత్రిపదవిని కూడా ఇచ్చారు.


ఈ విషయంలో ఆయా పార్టీలు గొడవ చేస్తున్నాయి. చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరాయి. దీనిపై కోర్టుకు కూడా వెళ్లాయి. అయితే.. స్పీకర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.తాము తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాం మొర్రో అని చెప్పుకొని.. ఎంచక్కా ఆ ప్రభుత్వంలో మంత్రి పదవులను అనుభవిస్తున్న వారిని కూడా ఇంకా వారు గెలిచిన పార్టీల్లో ని సభ్యులుగా చూపుతున్నారు.


తలసాని పేరు ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేల జాబితాలో ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను కూడా సమర్పించాడు. అయితే ఇప్పటి వరకూ దాన్ని ఆమోదించడం కానీ.. తెరాసలో చేరి మంత్రిపదవిని స్వీకరించిన ఆయనపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. మర ఇలా ఎన్ని రోజులు బండిలాగిస్తారో! 


మరింత సమాచారం తెలుసుకోండి: