ఎక్కడైనా పోలీసులు తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత వస్తులు దొరికితే పోలీసులు సీజ్ చేస్తారు. ఆ రాష్ట్ర పోలీసుల అదుపులో ఉంచుతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. కేసు విచారణలో అక్రమమని తేలితే.. ఆ వస్తువులను వేలం వేసి ఆ రాష్ట్ర ఖజానాకు జమ చేస్తారు. ఇదీ ఇన్నాళ్లూ జరుగుతున్న వ్యవహారం.

ఈ విషయంలో ఇప్పుడు కేంద్రం.. ఆంధ్రాకు ఓ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. దేశంలో ఎక్కడ ఎర్రచందనం దొరికినా.. దాన్ని అమ్ముకునే అవకాశం కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఉండేలా ఇక నిబంధనలు రూపొందిస్తారట. అంటే.. కాశ్మీర్ టు కన్యాకుమారి..  దేశంలో ఎక్కడ ఎర్ర చందనం దొరికినా అది ఏపీకే చెందుతుందన్న మాట. 

ఇలా ఎందుకయ్యా అంటే.. ఎర్రచందనం కేవలం ఏపీలో మాత్రమే లభిస్తుంది. అది కూడా కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే. అంటే దేశంలో ఎక్కడ దొరికినా అది ఏపీ నుంచి తరలి వెళ్లిందే అన్నమాట. అందుకే.. సహజంగా ఎర్రచందనం ఏపీకి మాత్రమే చెందింది కావడం వల్ల.. ఆంధ్రాకు ఈ వెసులుబాటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. 

తిరుపతికి వచ్చి కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అక్కడి అటవీశాఖ, టాస్క్ ఫోర్స్ అధికారుతో సమావేశమయ్యారు. శేషాచలం అడవులు, ఎర్రచందనం, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఆ సమయంలో అటవీ అధికారులు ఎర్రచందనం విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఆయన దేశంలో ఎక్కడ దొరికినా ఏపీకే చెందేలా నిబంధనలు రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: