కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకం రసవత్తరంగా మారింది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా కందుల శివానంద రెడ్డి పేరు ప్రకటించి రోజులు గడవకముందే ఆ పదవి నాకొద్దంటూ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను డీసీసీ పదవిని వద్దనుకుంటున్నానని కందుల స్పష్టం చేశారు. పదవులను ఆశించి ఎందరో నేతలు భంగపడుతుంటే కోరి వచ్చిన జిల్లా అధ్యక్ష పదవిని కందుల శివానందరెడ్డి కాదనుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని జిల్లా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేగా, పదేళ్ళు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి 35 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న కందుల.. వ్యక్తిగత కారణాలతో ఈ పదవిని చేపట్టలేకపోతున్నాని, ఈ పదవిని వేరే ఎవరికిచ్చినా వారికి పూర్తి సహకారం అందిస్తానని అధిష్టానానికి ఫ్యాక్స్ పంపారు. కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు చెబుతూనే..  పదనివి చేపట్టలేనందుకు చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కందుల పదవి వద్దనడానికి చాలా కారణాలున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. కడప జిల్లాలో జగన్ హవాను తట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం సాధ్యంకాదని కందుల భావిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం కష్టమనుకుంటున్నారు. జిల్లాలో మూడు దారులుగా ఉన్న ముగ్గురు మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, రామచంద్రయ్యల ను ఒకేతాటిపైకి తీసుకురావడం కూడా అసంభవమని ఆయన భావిస్తున్నారు. ఇవేవీ బహిరంగంగా చెప్పలేక వ్యక్తిగత కారణాలు అంటూ పదవిని సున్నితంగా తిరస్కరించారని ఆయన ఆనుచరులు చెబుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: