లండన్‌ : జర్మనీ విమానం కోపైలట్‌ ఆండ్రి యాస్‌ లూబిట్జ్‌పై సినిమాల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందు కంటే, ఆల్ప్స్‌ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్‌ బస్‌ ఏ320' కూలిపోయిన ఘటనకూ, ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన అర్జెంటీనా చిత్రం 'వైల్డ్‌ టేల్స్‌'కూ చాలా దగ్గరి పోలికలే ఉండటంతో ఈఅనుమానాలు బలంగా వినిపిస్తు న్నాయి. 

ఆ సినిమాలో ఏముంది? : 'వైల్డ్‌ టేల్స్‌' సినిమాలో పైలట్‌ కాక్‌పిట్‌ను లాక్‌ చేస్తాడు. ఆపదలో ఉన్న ప్రయాణికులు కాక్‌పిట్‌ తలుపును తెరవాలని ఎంత మొత్తుకున్నా తలుపు తెరవకుండా అతివేగంతో విమానాన్ని కిందకు తీసుకెళ్లి కూల్చేస్తాడు. విమానంలోని అందరు ప్రయాణికులతోపాటు తాను చనిపోతాడు. ప్రేమించి తనను మోసం చేసిన అమ్మాయిని, వర్క్‌ ప్లేస్‌లో తనను ఎప్పుడూ అవమానించే శత్రువులనూ తన విమానంలోకి ఎక్కించుకొని ఈ దారుణానికి పాల్పడతాడు.

ఆ సినిమాకూ, ఈ సంఘటనకూ పోలికలు : ప్రస్తుత ఘటనలో కోపైలెట్‌ లూబిడ్జ్‌ విమానాన్ని పర్వతాల్లో కూల్చేయగా, ఆ సినిమాలో పైలట్‌ తన తల్లిదండ్రులున్న ఇంటిపై విమానాన్ని కూల్చేస్తాడు. వారు కూడా ఈ ప్రమాదంలో చనిపోతారు. ఆ సినిమాలో పైలట్‌ తన జీవితంతో ముడిపడ్డ వారిని మాత్రమే విమానంలో ఎక్కించుకుని వారందరి మరణానికి కారణం కాగా, ఈ ఘటనలో లూబిడ్జ్‌ ఏ పాపం తెలియని 149 మంది అమాయక ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నాడు. 'వైల్డ్‌టేల్స్‌' చిత్రం జర్మనీ, స్పెయిన్‌ దేశాల్లో గతేడాదే విడుదల కాగా, ఈనెల 28వతేదీ శనివారం బ్రిటన్‌లో విడుదల యింది. ఈ చిత్రాన్ని లూబిడ్జ్‌ చూశాడా, లేడా అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, అతను జర్మనీలో ఉన్నందున, ఆ సినిమా తరహాలోనే ఈ విమానాన్ని కూల్చేసినందున అతను 'వైల్డ్‌టేల్స్‌' చూసే ఉంటాడనీ, ఆ సినిమా కథాంశాన్నుంచే స్ఫూర్తి పొంది ఉంటాడని విమర్శకులు విశ్లేషిస్తున్నారు.

బ్రిటన్‌లో ఆందోళన : ఘోరప్రమాదం జరగడం, ఆ ప్రమాదానికి 'వైల్డ్‌ టేల్స్‌' స్ఫూర్తిగా నిలచి ఉంటుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే బ్రిటన్‌ దేశవ్యాప్తంగా 'వైల్డ్‌టేల్స్‌' చిత్రాన్ని విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. విమాన ప్రమాద బాధిత కుటుంబాల బాధను, ఆవేదనను అర్థం చేసుకోకుండా బ్రిటిష్‌ డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకోవడానికే ఈ చిత్రాన్ని ఈ దశలో విడుదల చేశారన్నది ప్రజలు, విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ప్స్‌ పర్వతాల్లో కూలిపోయిన విమాన ప్రమాదంలో ముగ్గురు బ్రిటిష్‌ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల తేదీలను చాలా కాలం కిందటే ఖరారుచేసి, ప్రకటించి ఉన్నామనీ, అలాగే టిక్కెట్ల విక్రయాలు కూడా ఎప్పుడో జరిగిపోయాయనీ, అందువల్లనే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: