నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ మండలాలకూ విస్తరించింది. బెట్టింగ్‌ల స్వరూపం కూడా మారింది. గతానికి భిన్నంగా ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఈ ధోరణి విపరీతంగా పెరిగింది. లీగ్ దశ వరకు మోస్తరుగా కనిపించిన బెట్టింగ్‌లు నాకౌట్, క్వార్టర్ ఫైనల్స్ చేరుకునే సరికి భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇక సెమీఫైనల్స్‌కు భారత్ జట్టు చేరుకోగానే పందాలు అంచనాలు మించి దాటాయి. టాస్ నుంచి మొదలు వికెట్లు, ఓవర్లు, బంతులు, బౌండరీలు, సిక్సర్లు ఇలా విడివిడిగా పందాలు నిర్వహించారు. ఇక ఆదివారం జరిగే ఆస్ట్రేలియా- న్యూజిల్యాండ్ మధ్య ఐసిసి వరల్డ్‌కప్ - 2015 ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ముందస్తు బెట్టింగ్‌లు ప్రారంభమైనట్లు తెలిసింది.

ఈ ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ముఖ్యంగా భారత్ ఆడిన మ్యాచ్‌లపై భారీ స్థాయిలోనే బెట్టింగ్‌లు జరిగినట్లు అంచనా. అంతకు మించి ఐసిసి వరల్డ్‌కప్-2015కు ఫెవరేట్‌గా ఉన్న ఆస్ట్రేలియా- న్యూజిల్యాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు భారీగానే బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు అంచనా. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే చివరి పోరు కావడంతో ఇప్పటివరకు నష్టపోయిన బుక్కీలు, పందెంరాయుళ్లు ఈ మ్యాచ్‌ల్లో ఫ్యాన్సీలు, మ్యాచ్‌లపై పందాలు వేసి పొగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. క్రికెట్ పందాలపై దృష్టిసారించిన పోలీస్ భీమవరం ప్రాంతంలో ఆకివీడుకి చెందిన ఇద్దరిని, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరికొంతమంది యువతను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా గతంలో జిల్లాల వారీగా, నగరాల వారీగా కొన్నిచోట్ల బెట్టింగ్‌లు జరిగేవి. బుక్కీలు, తమ ఏజెంట్లు వీటిని నిర్వహించేవారు. ఈసారి వీటి స్వరూపం పూర్తిగా మారింది. మండల కేంద్రాల్లోనూ క్రికెట్ అభిమానులు నలుగురైదుగురు ఉంటే చాలు కనీస స్థాయిలో బెట్టింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వీరిలో ఒకరు ఏదైనా ఒక హోటల్, లాడ్జిని లేదా ఏదైనా ఇంటిని ఎంచుకుని తిలకిద్దాం అంటూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

ఇక ఏ జట్టు గెలుస్తుందనే విధంగా జరిగే బెట్టింగ్ ఎక్కువ వ్యవధిలో ముగుస్తుంది. ప్రస్తుతం ఆ బెట్టింగ్‌ల కంటే బంతి బంతికి జరిగే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. టాస్ ఎవరు గెలుస్తారనే స్థాయి నుండి ఏ ఓవర్‌కి ఎన్ని పరుగులు వస్తాయి, ఏ బ్యాట్స్‌మ్యాన్ వికెట్ ఎవరు తీస్తారు, ఏ బంతికి సిక్స్, ఫోర్ వెళ్తుంది, ఏ ఓవర్ మెయిడిన్ ఓవర్‌గా ఉంటుంది, స్కోరు ఎంతవరకు వెళ్తుంది, పవర్ ప్లేలో ఓవర్‌కి ఎన్ని పరుగులు వస్తాయి ఇలా వివిధ స్థాయిల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా- న్యూజిల్యాండ్ ఫైనల్ పోరు విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 70.83 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని, న్యూజిల్యాండ్‌కు 29.17శాతం మాత్రమే విజయావకాశాలు ఉన్నాయని విశే్లషకులు ముందుగానే ప్రకటించడంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా దానికి తగ్గట్టుగానే పందాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: