ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల వసూళ్లు పుంజుకోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. దీంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో విలవిలలాడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అందరూ ఊహించినట్లుగా మరీ దిగాలు పడాల్సిన పనిలేదన్న సంకేతాలూ వెలువడ్డాయ. రాష్ట్ర ప్రభుత్వం.. 2015-16కుగాను ప్రకటించిన ద్రవ్యవిధాన వ్యూహాత్మక పత్రంలో పలు ఆసక్తికరమైన వివరాలు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పన్నుల రాబడి రూ. 44,423 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని రంగాలకు కీలకమైన, ప్రధాన ఆర్థిక వనరైన హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ కోల్పోయినా, సొంత పన్నుల వసూళ్ల రంగం ఆశాజనకంగా ఉండడం గొప్ప పరిణామమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల వసూళ్లు రూ. 37,398 కోట్లు వస్తే చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేసింది.

కాని అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అదనంగా వెయ్యి కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. మార్చి నెల వరకు రూ. 38,475 కోట్ల వచ్చాయ. ఎక్సైజ్, రవాణా, వ్యాట్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో పన్నుల విధానం బాగుండడం వల్ల సాధ్యమైందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో పేర్కొన్న విషయం విదితమే. లోపాలను సరిదిద్దడం, పన్ను చెల్లింపుల వ్యయాన్ని తగ్గించడం, పన్ను విధానాన్ని హేతుబద్ధీకరణ చేయడం వల్ల సొంత పన్నుల ఆదాయం లక్ష్యాన్ని దాటింది. మొత్తం రెవెన్యూలో వాణిజ్య శాఖ రారాజు లాంటిది. ఈ శాఖ వాటా 65 శాతం ఉంటుంది. ఈ శాఖ రెవెన్యూలో విలువ ఆధారిత పన్ను, సెంట్రల్ అమ్మకం పన్ను కీలకపాత్ర పోషిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ శాఖ ద్వారా ఈ ఏడాది జననరి వరకు వచ్చిన రెవెన్యూ రూ. 21,287.12 కోట్లు. ఉమ్మడి ఆంధ్రలో 2013- 14లో ఈ శాఖ ద్వారా రూ. 50.54 2.14 కోట్ల ఆదాయం వచ్చింది. 2014-15లో రూ. 28,749 కోట్లు లక్ష్యం చేసుకోగా, ప్రాథమిక అంచనాల ప్రకారం మార్చి నాటికి రూ. 29,671 కోట్లకు చేరుకుంది.

వ్యాట్, సిఎస్‌టి, వినోదపు పన్ను, వృత్తిపన్ను, లగ్జరీ పన్ను, ఎంట్రీ టాక్స్, ఆర్‌టి సెస్‌లు వాణిజ్య శాఖ పరిధిలోకి వస్తాయి. వాణిజ్య శాఖ తర్వాత ఎక్కువ ఆదాయం తెచ్చే శాఖ ఎక్సైజ్. ఈ శాఖ ద్వారా 2014-15లో రూ. 4,027 కోట్లను సేకరించాలని లక్ష్యం గా పెట్టుకోగా, రూ. 4,229 కోట్లను సమీకరించారు. రాష్ట్రంలో 4,380 వైన్‌షాపులు, 7,700 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రవాణా శాఖ ద్వారా ఈ ఏడాది రూ. 1,384 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, మార్చి వరకు రూ. 1,903 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది జనవరి నాటికి ప్రకటించిన గణాంక వివరాల ప్రకారం అంతకు ముందు ఏడాదిపైన 17.19 శాతం వృద్ధితో రూ. 1,520.27 కోట్ల ఆదా యం వచ్చింది. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 2,461 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ. 2,672 కోట్లు వచ్చాయ. ఈ శాఖలో 48.81 శాతం వృద్ధిరేటు నమోదైంది. పన్నుయేతర రాబడి రంగాలను విశే్లషిస్తే రూ. 8,921 కోట్ల ఆదాయం వచ్చింది. గనులు, ఖనిజ శాఖ నుంచి రూ. 1,137 కోట్లు, వడ్డీల రాబడి రూ. 183 కోట్లు, గ్రామీణాభివృద్ధి సెస్ ద్వారా రూ. 522 కోట్లు వచ్చింది. వచ్చే ఏడాది పన్నుయేతర రాబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై అదనంగా 15 శాతం వస్తుందని అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: