కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అధికారికంగా నవమి వేడుకలను నిర్వహించడంతో ఒంటిమిట్టకు కొత్త సోభ చేకూరింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ క్రిష్ణమూర్తి సతీసమేతంగా విచ్చేసి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కెఇతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ వి. సతీష్‌రెడ్డి, ఎంపీ సిఎం రమేష్‌ నాయుడు, ప్రభుత్వ విప్‌లు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, కోన రవికుమార్‌ హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భారీ ఎత్తున బాణా సంచా పేల్చారు. అనంతరం వేదపండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులకు పండితులు స్వామి వారి చిత్రపటాలను బహూకరించారు. శాలువలతో ఘనంగా సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని భద్రాచలం కంటే మిన్నగా అభివృద్ధి పరుస్తామని,                 

ఇందుకు 25 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందిస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేయడం మహాభాగ్యమని పేర్కొన్నారు. రెవెన్యూశాఖలో అడంగల్‌, అజమాయిషీ వంటి భాషలను తొలగిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రాయసీమలో మూడుకార్లు పంటలు సాగు చేసుకోవచ్చన్నారు.

విఐపిల రాకతో భక్తుల ఇక్కట్లు                 

శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట ఆలయానికి జిల్లాలోని నలుమూలల నుండి భారీ సంఖ్యలో విఐపిలు రావడంతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. సామాన్య భక్తులు ఎండకు క్యూలైన్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులు సైతం భక్తులు పోటెత్తుతారని ఊహంచలేక పోయారు. ఆలయం వెనుకభాగం వరకు క్యూ కొనసాగింది. ఒకానొక దశలో ఆలయం లోపల విఐపిల తాకిడి ఎక్కువ కావడంతో క్యూలైన్లో భక్తులు కోపోద్రిక్తులై కేకలు వేస్తూ సామాన్యులకు ఆలస్యం చేయడం తగదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విఐపిల దర్శనాన్ని ఆపేశారు. 

భారీ బందోబస్తు                 

బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా యాత్రికులకు రక్షణ కల్పించేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. శుక్రవారం ఉదయం నుండి పోలీసులు ఒంటిమిట్టలో కవాతు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతాలలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల వద్ద, ప్రధాన రహదారిల వెంట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను రాజంపేట డిఎస్పీ అరవింద్‌బాబు పర్యవేక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: