ఇప్పటికే తెలంగాణ ప్రాంతం వారు చాలా రకాలుగా నిరసన తెలిపారు. భద్రాచల ప్రాంతంలోని కొన్ని మండలాలను ఆంధ్రలో కలపడం పట్ల వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం  చేసిన నిర్ణయాన్ని తెలంగాణలోని రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా ఖండించారు. ఆ మండలాలు తెలంగాణలో కలపాలని వీరు డిమాండ్ చేశారు.

ఈ విషయంపై తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలు పార్లమెంటులో నిరసన తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు అయితే.. ఈ విషయంలో అటు కాంగ్రెస్ మీద, ఇటు భారతీయ జనతా పార్టీ మీద మండి పడ్డారు. ఇది  ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయం అన్నారు. కాంగ్రెస్ వాళ్లేమో... ఇది బీజేపీ చేస్తున్న అన్యాయం అంటే, బీజేపీ మాత్రం విభజన బిల్లులో కాంగ్రెస్ వాళ్లే ఆ మండలాలను ఏపీలో కలిపారని ప్రతి విమర్శ చేశారు.

రాష్ట్ర విభజనజరిగినప్పటి నుంచి ఈ విషయంలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్పందించిన తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంది. తాను ఈ విషయం గురించి ఏపీ సీఎం చంద్రబాబుతోనే మాట్లాడతానని కేసీఆర్ అంటున్నారు. ఏపీలో కలిపిన నాలుగు మండలాలనూ తెలంగాణలో కలిపేయమని కోరతానని కేసీఆర్ చెప్పుకొచ్చాడు.

మరి దానికి చంద్రబాబు ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరమైన అంశమే. ఇప్పటికే కేసీఆర్ , చంద్రబాబుల మధ్య వ్యక్తిగతంగా సాన్నిహిత్యం కొంచెం పెరిగింది. వీళ్లిద్దరూ కలిసినప్పుడు సరదాగా మాట్లాడేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఆ నాలుగు మండలాలనూ కలిపేయమని అడిగితే.. చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తాడో.. ఊహూ.. అంటాడో! 


మరింత సమాచారం తెలుసుకోండి: