సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సిఎం చంద్రబాబు అనుసరిస్తున్న తీరు రాష్ట్రంలో అసమానతలను పెంచి పోషించే టట్టు కనిపిస్తోంది. రాయలసీమకు నీటికోసం ఉద్దేశించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పట్టుబట్టి మరీ రూ. 1,300 కోట్లు కేటాయించిన చంద్రబాబు, ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎత్తి పోతల పథకానికి ముచ్చటగా రూ. 3 కోట్లే కేటాయించడం దీనికి ఉదాహరణ. పట్టిసీమ ప్రాజెక్టు కంటే ముందునుంచే ప్రతిపాదనలో ఉన్న ఎత్తిపోతల పథకం సుజల స్రవంతిపై నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  తమకు తాగునీరు, సాగునీరు అందించాల్సిన ఈ పథకానికి తూట్లు పొడిచారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిం చాలని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఈ పరిస్థితుల్లో సుజల స్రవంతిని పూర్తిచేయాల్సిన ప్రభుత్వం, కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. 

గోదావరి నుంచి 63.2 టిఎంసిల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించి 8 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన సుజల స్రవంతి పథకానికి 2009 జూన్‌2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో 24 మండలాల్లో 3.94 లక్షల ఎకరాలు, విశాఖపట్నం జిల్లాలోని 18 మండలాల పరిధిలో 3.21 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాల్లో 85 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఏటా 12.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారోత్పత్తి వస్తుందని అంచనా రూపొందించింది. అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. విశాఖ జిల్లాలోని 379 గ్రామాలకు, విజయనగరం జిల్లాలోని 569 గ్రామాలకు, శ్రీకాకుళం జిల్లాలోని 89 గ్రామాలకు తాగునీరు, 4.74 టిఎంసిల నీరు పారిశ్రామిక అవసరాలకు అందించొచ్చు. 

మిగిలిన సాగునీటి ప్రాజెక్టులతో పోల్చుకుంటే సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల సంఖ్య కూడా ఎక్కువేమీ కాదు. రూ. 7,214.10 కోట్ల ప్రారంభ వ్యయంతో దీన్ని తలపెట్టి నప్పటికీ 2009-10లో కేటాయిచింది కేవలం రూ. 50 కోట్లే. ఆ తరువాత ఏటేటా రెట్టింపు స్థాయిలో నిధులను తగ్గించింది. 2015-16 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి 3 కోట్లే కేటాయి ంచింది. ఈ అరకొర నిధులు ఏటేటా కార్యాలయ నిర్వహణ, అధికారుల వాహనాల అద్దె, డీజిల్‌ ఖర్చులకే సరిపోని పరిస్థితి దాపురించి.. సుజల స్రవంతి లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టిసీమ ప్రాజెక్టు మాదిరిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికీ నిధులు కేటాయిం చాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా వెనుకబడినవేనని... రాయలసీమకు ప్రాధాన్యమిచ్చినట్లే తమకూ ప్రాధాన్యమివ్వాలని వారు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: