ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రాజధానికి భూములిచ్చిన రైతులు . భూములు స్వాధీనం చేసుకునేందుకు వీలుగా చెల్లిస్తున్న కౌలు పరిహారాన్ని తీసుకోకూడదని కొందరు రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అంతర్గతంగా రైతులు సమావేశాలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా సమీకరణ నిబంధనల్లో పేర్కొన్న 2, 5, 15, 28 సెక్షన్లు రైతు మనుగడను ప్రశ్నిస్తున్నాయని, వాటి గురించి చెప్పకుండానే తమ వద్ద భూములు తీసుకున్నారని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకే భూములు తీసుకుంటామని చెప్పి ఇప్పటికీ పూలింగు ప్రక్రియ నిర్వహిస్తున్నారని రైతులు చెబుతున్నారు. పార్టీని నమ్మిన తమనే బెదిరించి, భయపెట్టి భూములు లాక్కున్నారని, భవిష్యత్‌లో మోసం చేయరని నమ్మకమేమిటని తెలుగుదేశం నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో రైతులు దరఖాస్తులు వెనక్కిచ్చేయాలని వినతిపత్రాలిచ్చారు.

నిడమర్రు, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో ఈ డిమాండు ముందుకు రాక ప్రస్తుతం అన్ని గ్రామాలకూ విస్తరిస్తోంది. జరీబు భూములున్న రాయపూడిలోనూ రైతులు తమ దరఖాస్తులు వెనక్కు ఇచ్చేయాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వెంకటపాలెంలో రైతులు ప్రస్తుతానికి కౌలు తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. జరీబులకు పెంచిన 150 గజాలకు సంబంధించిగానీ, ఎకరంలోపున్న పొలాలకు పరిహారం ఎకరానికి తగిన విధంగా ఇస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై గానీ ఇంతవరకూ ఉత్తుర్వులు రాలేదని రైతులు చెబుతున్నారు. 

పరిహారం పెంచేలా చూస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే.. ఎంపీ ఇప్పుడు తమకు కనిపించడం లేదని... అంతా కలిసి మోసం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. మల్కాపురం, మందడం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు మినహాయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: