దేశంలో మొబైల్ ద్వారా వాణిజ్య లావాదేవీలు శరవేగంగా పుంజుకుంటున్నాయని ఓ సర్వే వెల్లడించింది. మరికొన్నేండ్లలో మొబైల్ ద్వారా వాణిజ్యం ఈ-కామర్స్‌ను మించిపోనుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ కేపీఎంజీ రిపోర్టు వెల్లడించింది. దేశీయ యువతలో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ పెరుగుతుండటంతోపాటుగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా మొబైల్ అప్లికేషన్ల (యాప్) డౌన్‌లోడింగ్ పెద్దఎత్తున వృద్ధి నమోదు చేసుకుంటున్నది. ఈ పరిణామం ఎం-కామర్స్‌కు ఊతమివ్వనుందని సంస్థ పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా దేశంలో మొబైల్ యాప్‌ల డౌన్‌లోడింగ్ 6 రెట్లు పెరిగి 900 కోట్ల స్థాయికి చేరుకోనుందని కేపీఎంజీ నివేదిక తెలిపింది. 

మొబైల్ ద్వారా వాణిజ్య లావాదేవీలు



అంతేకాదు గత రెండు సంవత్సరాల్లో శరవేగంగా వృద్ధి చెందిన మొబైల్ యాప్ మార్కెట్ భారతేనట. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్‌ల డౌన్‌లోడింగ్‌లో ఇండియా వాటా 7 శాతం. ఈ విషయంలో ఇండోనేషియా, చైనా, అమెరికా తర్వాత నాలుగో స్థానం ఇండియాదే. గతేడాది మొబైల్ ద్వారా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకున్న భారతీయుల సంఖ్య ఏకంగా 33 శాతం పెరిగి 17.3 కోట్లకు చేరుకుంది. మొబైల్ నెటిజన్ల సంఖ్య ఏటా 21 శాతం వృద్ధి చెంది 2019 నాటికి 45.7 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ఈ తరుణంలో ఈ-కామర్స్ సంస్థలు కూడా మొబైల్ యాప్‌ల ద్వారా సేవలందించడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయని కేపీఎంజీ రిపోర్టు పేర్కొంది. అయితే మొబైల్ వినియోగదారులు కేవలం ఉచిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపింది. మొత్తం డౌన్‌లోడ్లలో ఉచిత యాప్‌ల వాటా 90 శాతమని అంటున్నది. 



మరింత సమాచారం తెలుసుకోండి: