టీ కాంగ్రెస్ ఎంపీల పయనం ఎటు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ''తెలంగాణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం, తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందనే విమర్శలున్నాయి, తెలంగాణ ఇవ్వకపోతే ఆ ప్రాంతంలో పార్టీకి మనుగడ లేదు..'' కొద్దిరోజులుగా పదేపదే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ స్వపక్షంలో విపక్షంలా తయారైన టి కాంగ్రెస్ ఎంపిల భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపై ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతోంది.  టీ కాంగ్రెస్ ఎంపీలంతా త్వరలోనే పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మంత్రి జానారెడ్డితో గంటలపాటు భేటీలు, ఎంపి వివేక్ నివాసంలో రహస్య మంతనాలు, మధ్యలో సీనియర్ నేత కెకె సలహాలు, మరోవైపు సిఎం కిరణ్ పై విమర్శనాస్త్రాలు. కాంగ్రెస్ లో ఉంటూ ప్రతిపక్షపార్టీలకు మద్దతిచ్చేలా మాట్లాడుతోన్న టి కాంగ్రెస్ ఎంపిలు ప్రస్తుతం తమ రాజకీయ భవిష్యత్ కు స్పష్టత తెచ్చుకునే పనిలో పడ్డారు.  తెలంగాణపై తమ అధిష్టానం ఇంకా నాన్చుడు ధోరణినే కొనసాగిస్తుండటంతో డైలమాలో పడ్డ నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కెకె ఇల్లు కేంద్రంగా నడుస్తోన్న ఈ తతంగానికి ఆయనే సూత్రధారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సొంతకుంపటి పెట్టుకుంటారన్న వార్తల్ని కెకె ఖండించకపోవటం, టి కాంగ్రెస్ ఎంపిలు పార్టీని వీడరని స్పష్టం చేయకపోవటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.  అంతేకాదు, టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కెకె పొగడ్తల జల్లు కురిపించటం కొంతమంది టి కాంగ్రెస్ ఎంపిల భవిష్యత్ ప్రస్థానం పై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యేలా చేస్తోంది. కాంగ్రెస్ లో టిఆర్ఎస్ ను విలీనం చేస్తామని కెసిఆర్ చేసిన ప్రకటన గొప్ప త్యాగం గా కెకె చెప్పటం, ఆయనపై టి కాంగ్రెస్ నేతలకు ఉన్న భావనకు అద్దంపడుతోంది. కాంగ్రెస్ ను కుట్రలపార్టీగా అభివర్ణించిన కెసిఆర్ పై ప్రతివిమర్శలు చేయకపోవటం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వాదులంతా టిఆర్ఎస్ కే పట్టం కడుతారన్నట్లుగా మాట్లాడటం వెనుక తమ మార్గం టిఆర్ఎస్సేనని పరోక్షంగా కెకె స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ మార్పులు, చేరికలు ఇప్పటికిప్పుడు అయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతోన్న నేపధ్యంలో తెలంగాణ పై అధిష్టాన వైఖరి తెలుసుకున్న తర్వాతే తదుపరి కార్యాచరణ కోసం టి కాంగ్రెస్ ఎంపిలు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో అధినేత్రి సోనియాకు తమ భవిష్యత్ వ్యూహంపై లేఖ రాయనున్నారు. మొత్తంగా డిసెంబరు 9 లోగా తెలంగాణ పై నిర్ణయం తీసుకోవాలనీ, లేదంటే తమ దారి తాము చూసుకుంటామనే అర్ధం వచ్చేలా ఇప్పటికే లేఖ తయారు చేసినట్లు సమాచారం. మరోవైపు సొంత కుంపటి పెట్టుకుంటే ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా నేతలు అంచనా వేసినట్లు తెలిసింది. అయితే సొంతపార్టీ అంటే ఆర్ధికంగా కూడా కష్టమేనన్న భావనను కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం. మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై మనసు పడ్డట్లు పార్టీలో చర్చ వినిపిస్తోంది. ఇక జగన్ ను కలవడమే తరువాయనీ, పార్టీలో చేరికకు దాదాపు రంగం సిద్ధమైందనీ తెలుస్తోంది. మిగతా ఎంపిలు టిఆర్ఎస్ లో తమ భవిష్యత్ ఎలా ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబరు 9 తర్వాతే టి కాంగ్రెస్ ఎంపిలకు తమ భవిష్యత్ పై స్పష్టత వచ్చేలా ఉంది. అయితే పార్టీలోని తెలంగాణ నేతలు మాత్రం టి కాంగ్రెస్ ఎంపిలు పార్టీని వీడరంటున్నారు. వారికి ఇప్పుడున్న హోదాను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణే తమ లక్ష్యమని చెప్పే టి కాంగ్రెస్ ఎంపిలు టిఆర్ఎస్సే మార్గంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ ను నమ్మలేమని భావిస్తోన్న నేతలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై ఎంతవరకు నమ్మకంతో ఉన్నారో తెలియడం లేదు. డిసెంబరు 9 వరకు అధిష్టానానికి గడువిద్దామని భావిస్తోన్న ఎంపిలకు, మరి ఢిల్లీ పెద్దల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: