విభజన చట్టంలోని నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం మరోసారి తుంగలో తొక్కింది. పదేళ్ల పాటు ఉమ్మడి పన్ను విధానం ఉండాలన్న రూల్ ను గాలికొదిలేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు వచ్చే ఆంధ్రా రవాణా వాహనాలపై పన్ను వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 


రాజధాని ప్రాంతం కావడంతో ఏపీ నుంచి అనేక రకాల రవాణా వాహనాలు హైదరాబాద్ కు వస్తుంటాయి. ఇప్పటివరకూ ఈ వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించేటప్పుడు రవాణా పన్ను కట్టడం లేదు. జూన్ 2 నే రాష్ట్రం విడిపోయినా ఇప్పటివరకూ పన్ను ప్రస్తావన రాలేదు. 

ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుండటంతో తెలంగాణ సర్కారు ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను కూడా ఇకపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలుగానే భావించి పన్ను వేయాలని కేసీఆర్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 

కేసీఆర్ విధిస్తున్న పన్నుపోటు ప్రధానంగా ప్రైవేటు బస్సులపై పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ కు ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై పన్ను వేయడం వల్ల పరోక్షంగా ఏపీ ప్రయాణికులపై భారం పడే అవకాశం ఉంది. ఐతే.. రాష్ట్రాలు వేరయ్యాక.. ఇంకా ఉమ్మడి పన్ను వ్యవస్థ ఉండటంతో అర్థంలేదని.. ఇది చాలా సాధారణపరిణామమని ప్రభుత్వ పెద్దలు సమర్థించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: