ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే రవాణా వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్‌ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మోటారు వాహనాల పన్ను చట్టానికి సవరణ చేస్తూ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కొత్త పన్ను బుధవారం నుంచి అమల్లోకి రానుంది. 'ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే వాహనాలనూ అదేవిధంగా పరిగణించాలి. ఆయా రాష్ట్రాల వాహనాల నుంచి వసూలు చేస్తున్న విధంగానే ఎపి నుంచి వచ్చే వాహనాలకూ పన్ను విధించాలి' అని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 


తెలంగాణ సర్కారు ఎంట్రీ ట్యాక్స్‌ విధించడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అదే దిశలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే వాహనాలపై 2 శాతం పన్ను విధించాలని అధికారులు సూచించారు. కొంత చర్చ జరిగిన తరువాత కొద్దిరోజులు వేచి చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే ఈ లోగానే టి సర్కారు ఆ దిశలో నిర్ణయం తీసుకుంది. దీంతో తాజా పరిణామాలపై చర్చించిన అధికారులు ముఖ్యమంత్రి వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు.అయితే ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలను పన్ను పరిధి నుంచి మినహాయించాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: