నవ్యాంధ్రప్రదేశ్-లో తిరిగి బలం పుంజుకునేందుకు మావోయిస్టులు శక్తియుక్తులు కూడగట్టుకుంటున్నారా? మళ్ళీ నల్లమల కేంద్రంగా ఉద్యమ వ్యూహ రచన చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎర్ర జండా రెపరెపలాడనుందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి పార్టీ నివేదికలు, నిఘా వర్గాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత, రుణ మాఫీ అమలులో జరుగుతున్న జాప్యం, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకుని ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ భావిస్తున్నాట్లు సమాచారం. రాజధాని నిర్మించాలని భావిస్తున్న గుంటూరు జిల్లా కేంద్రంగా కొత్తగా కమిటీని ఏర్పాటు చేయాలని మావోయిస్టు పార్టీ భావిస్తోంది. రాజధాని కమిటీ ఏర్పాటుపై మావోయిస్టులు పెద్ద కసరత్తే చేశారు.


ఈ నేతను పూర్తిస్థాయిలో రాజధాని కమిటీ బలోపేతం

గుంటూరు జిల్లాకే చెందిన సీనియర్ నేతను కార్యదర్శిగా నియమించింది పార్టీ. గురజాలకు చెందిన ఆ నేత 30 ఏళ్ళుగా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం దండకారణ్యంలో పనిచేస్తున్న ఈ నేతను పూర్తిస్థాయిలో రాజధాని కమిటీ బలోపేతం కోసం వినియోగించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లా కమిటీలను ఏకం చేస్తూ నూతన కమిటీని మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలతో పాటు తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నేతలను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. మొత్తం 16 మందిని కమిటీ సభ్యులుగా నియమించిన పార్టీ వారు చేయాల్సిన పనులను సైతం విభజించి కేటాయించింది. రిక్రూట్-మెంట్ ద్వారా క్యాడర్ పెంచుకోవడం నుంచి ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అవసరమైతే మెరుపు దాడులకు దిగి క్యాడర్-లో నూతన ఉత్సాహాన్ని నింపాలని భావిస్తోంది. రాజధాని కమిటీ వ్యవహారాలను ఏపీ రాష్ట్ర కమిటీ పర్యవేక్షిస్తుంది. 


సమావేశ స్థలంలో పోలీసులకు కీలక డాక్యుమెంట్లు

ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కీలక సమావేశం జరిగింది. నల్లమల కేంద్రంగా తిరిగి ఉద్యమ నిర్మాణం చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంపై ఆంధ్రా- ఒడిశా పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో అగ్రనాయకులు తృటిలో తప్పించుకున్నారు. సమావేశ స్థలంలో పోలీసులకు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ఒడిశా దండకారణ్యం నల్లమలలో వ్యూహాలకు సంబంధించిన అనేక విషయాలు పోలీసులకు చిక్కాయి. దీంతో ఏపీ పోలీసులు మావోయిస్టులను కట్టడి చేయడానికి వ్యూహాలు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మావో సానుభూతిపరులపై కన్నేసి ఉంచిన నిఘా వర్గాలు మావోలను దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: