రాష్ట్రవిభజనతో ఆంధ్రా స్టూడెంట్స్ భలే ఇబ్బంది పడిపోతున్నారు. పదేళ్ల పాటు ఉమ్మడి విద్యా సౌకర్యాలు ఉంటాయన్న విభజన చట్టం హామీ అమల్లో అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. పోనీ.. కోర్టులకెక్కుదామా అంటే ఏళ్లూ, పూళ్లూ పడుతోందని ఏపీ సర్కారు కూడా సైలెంటైపోతోంది. 

ఇప్పుడు ఎంసెట్ రాసే ఆంధ్రా విద్యార్థులకు కొండంత కష్టం వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మంచి కాలేజీల్లో చేరాలంటే ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాయాల్సిందేన్నమాట. సరే పోనీ రెండు ఎంసెట్ లు రాయడానికి విద్యార్థులు సిద్డపడినా ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ వచ్చింది. 

ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్ రాసే విద్యార్థులు కచ్చితంగా తెలంగాణకు వచ్చి రాయాల్సిందే.. ఎందుకంటే ఆంధ్రాలో తెలంగాణ ఎంసెట్ కు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. శ్రీకాకుళం విద్యార్థి అయినా.. అనంతపురం విద్యార్థి అయినా.. హైదరాబాద్ చుట్టుపక్కల కాలేజీల్లో చేరాలంటే.. తెలంగాణ వచ్చి పరీక్ష రాయాల్సిందేనన్నమాట. 

ఎంసెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేర్వేరు తేదీల్లో జరుగుతోంది. మే 8న ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ నిర్వహిస్తుండగా, మే 14న తెలంగాణ ఎంసెట్ జరుగుతోంది. ఇప్పటి వరకూ తెలంగాణ ఎంసెట్ కోసం దాదాపు 20 వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాయి. మెడికల్ విభాగానికి పది వేల దరఖాస్తులు ఏపీ నుంచి వచ్చాయి. 

మరి అలా ఎందుకు చేశారు. ఆంధ్రానుంచి కూడా ఎగ్జామ్ రాస్తారని తెలుసుకదా.. అని తెలంగాణ అధికారులను అడిగితే... మమ్మల్ని ఎవరూ ఎగ్జామ్ సెంటర్ పెట్టమని అడగలేదని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఏపీ అధికారులు.. పరీక్షాకేంద్రాల గురించి అడిగితే ఏమైనా ఫలితం ఉంటుందేమో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: