మెరుగైన ప్రజాస్వామిక మరియు పారదర్శక పాలన అందించే లక్ష్యమే తన ఉనికికి కారణంగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యున్నత నాయకత్వ స్ధాయిలో ఎదురవుతున్న కష్టాలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తనకు తక్షణమే మద్దతు అవసరమైన చోట –ఢిల్లీ ఎం.ఎల్.ఏ లలోనూ, జాతీయ కార్యవర్గ సభ్యులలోనూ- తేలికగానే పొందగలుగుతున్నప్పటికీ అసమ్మతి ద్వయం ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు లేవనెత్తిన సమస్యలు అంత త్వరగా రూపుమాసేవి ఏమీ కావు. భారతీయ రాజకీయ వ్యవస్ధలో ఏ అంశాలనైతే సమస్యలుగా ఎ.ఎ.పి చూస్తున్నదో –అవినీతి, పారదర్శకత లోపం, బాధ్యతారాహిత్యం- అవే ఇప్పుడు ఆ పార్టీలో భాగంగా మారినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీలలో ఏయే జబ్బులు ఉన్నాయని ఎఎపి దాడి చేస్తుందో అవే తననూ పీడిస్తున్నాయని వరుసగా చోటు చేసుకున్న ‘వెల్లడి’లు తెలియజేస్తున్నాయి.


హార్స్ ట్రేడింగ్ (ఎం.ఎల్.ఎల కొనుగోళ్ళు) దగ్గరి నుండి అనుమానాస్పద నేపధ్యం ఉన్న వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇవ్వడం, నియంతృత్వపూరితంగా నిర్ణయాలు చేయడం, అసమ్మతిని తొక్కి పెట్టడంల వరకు గమనిస్తే భారత రాజకీయ వ్యవస్ధను పట్టి పీడిస్తున్న సకల రోగాలకు తేలికగా ప్రభావితం అయ్యేదిగా ఎఎపి కనిపిస్తున్నది. ఎఎపి, రాజకీయ వ్యవస్ధను మార్చడానికి బదులుగా రాజకీయ వ్యవస్ధే ఎఎపి ని తనలో కలిపేసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఇవన్నీ ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలను మెరుగుపరిచి ఉండవచ్చు. కానీ ఆ పార్టీ క్రమంగా మెల్లగా మరో భారతీయ తరహా రాజకీయ పార్టీగా తయారవుతోంది. తన స్ధాపనా సూత్రాల విషయంలో ఆ పార్టీ పాల్పడే ప్రతి ఒక్క రాజీ ఎఎపి తన స్వాభావిక మద్దతుదారులయిన యువత, పౌర సమాజ ఉద్యమాల పట్ల పాల్పడుతున్న ఒక్కొక్క మోసానికి సంకేతం. ఇప్పటివరకు ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిపైనా వారు భ్రమలు కోల్పోయి ఉన్నారు మరి! మార్పు తెస్తామన్న హామీతో మాత్రమే ఎఎపి గెలుపు సాధ్యపడింది. ఈ హామీకి నీళ్ళు వదలడం అంటే ఎన్నికల విజయం కోసం రాజకీయ ఓటమిని అంగీకరించినట్లే కాగలదు. ఎఎపి నిజంగా విజయవంతం కావాలంటే అది కేవలం ఆ పార్టీ సొంత సూత్రాల ప్రకారమే జరగాలి, అది కూడా తన సొంత ఆదర్శాలను యుద్ధ స్ఫూర్తిని వదులుకోకుండా!


కేజ్రీవాల్ తో ఎదురొడ్డడానికి భూషణ్, యాదవ్ లకు వేరు వేరు కారణాలు ఉండవచ్చు, కానీ పార్టీని నడిపిస్తున్న తీరు విషయంలో వారు ఇరువురూ ఐక్యంగా ఉన్నారు. నిజమే, కేజ్రీవాల్ పార్టీకి ఏకైక ముఖం. పార్టీ నాయకుడూ, అత్యంతగా కష్టపడే పార్టీ సభ్యుడూ ఆయనే. అయితే తన అనుచరులకు చెవి ఒగ్గని నేత అనతి కాలంలోనే ఒంటరిగా నడవవలసి వస్తుంది. ఒక సంస్ధ ఎదిగే కొద్దీ ఏకాభిప్రాయ నిర్మాణం, ప్రజాస్వామిక ప్రక్రియలు భారంగా తయారై త్వరిత గతిన నిర్ణయాలు చేయడానికి, సామర్ధ్యం కనబరచడానికి అవరోధంగా అనిపించవచ్చు. కానీ వ్యవస్ధాగత మార్పులు తేవాలని భావిస్తున్న రాజకీయ పార్టీకి దగ్గరిదారులు ఏమీ ఉండవు. అత్యున్నత స్ధాయి వ్యక్తివాద పని పద్ధతికీ, ప్రచారానికీ కేజ్రీవాల్ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. త్వరిత పరిష్కారాల పట్లనే ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అవి సమస్య యొక్క క్లిష్టతలను ఎల్లప్పుడూ ఆవాహన చేసుకోజాలవు. ఏ సంస్ధలోనైనా తగిన అవగాహనతో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఆ సంస్ధ అంతర్గత ప్రజాస్వామ్యంలో సమగ్ర భాగంగా ఉంటుంది. ఎఎపి మరియు కేజ్రీవాల్ లను భిన్నాభిప్రాయం మరియు అసమ్మతిలు నెమ్మదింపజేయవచ్చునేమో గానీ వారు సరైన దిశలో ప్రయాణం సాగించడానికి మాత్రం ఇవి అత్యవసరం!


మరింత సమాచారం తెలుసుకోండి: