మనిషి నిత్యజీవితంలో అన్నం తినకుండానైనా జివిస్తున్నాడేమో కాని టెక్నాలజీ అంటే కంప్యూటర్, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లాంటివి లేకుండా జీవించడం కష్టతరమే. అంతగా మనిషి మీద ప్రభావాన్ని చూపాయి కంప్యూటర్ టెక్నాలజీ. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మనిషి కంప్యూటర్ వాడకానికి ఎంత దగ్గర అవుతున్నాడో అన్ని రకాల రోగాలకు దగ్గరఅవుతున్నాడు. దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది.ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  


కంప్యూటర్ ఆపరేటర్స్ ఎదుర్కొనే సమస్యలు 


ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ : ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి 'టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్‌' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.


నిత్యం వేల మంది ల్యాప్ టాప్ ముందు కూర్చొని పని చేస్తుంటారు.


మరి ఇంతటి ప్రమాదం అని తెలిసినా మనం తీసుకోవాలసిన జాగ్రత్తలు ఏమిటి..!!

తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది.

పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి.

కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -

ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి.

కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి. కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి.

కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి. ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, -
ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: