మొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్. నిన్న మదన్ మోహన్ మాలవ్య. రేపు మరెవరో! వరుసగా కాంగ్రెస్ నేతల్ని హైజాక్ చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలకు మోదీ ప్రభుత్వం మరింత బలం చేకూర్చింది. ఆ లిస్టులో ఈసారి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును చేర్చుకుంది. ఏమైతేనేం పదహారణాల తెలుగువాడైన పీవీకి ఎట్టకేలకు సముచిత గౌరవమే దక్కబోతోంది. ఢిల్లీలో పీవీ స్మారకాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించడమే దీనికి కారణం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానిగా పీవీ నరసింహారావుకు పేరు ప్రఖ్యాతులున్నాయి. 1991- 96 సంవత్సరాల మధ్య ప్రధానిగా పనిచేసిన ఆయన దేశాభివృద్ధికి విశేష సేవలు అందించారు.

2004లో కన్నుమూసిన ఆయనకు ఢిల్లీలో స్మారకాన్ని నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదు. స్థలం కొరత వల్ల స్మృతి నిర్మాణాలకు బదులుగా ఉమ్మడి స్మారక స్థలం పేరుతో యమునానది ఒడ్డున ఏక్తా స్థల్-ను ఏర్పాటు చేసింది. తెలంగాణకు చెందిన పీవీకి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది టీడీపీ ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు స్పందించిన ఏన్డీయే ప్రభుత్వం ఏక్తా స్థల్-లోనే పీవీ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ కేబినెట్ నోట్-ను సిద్ధం చేసింది. ఈ చిహ్నాన్ని పాలరాతితో నిర్మించనున్నట్లు సమాచారం. 

అయితే మోదీ ప్రభుత్వం మహాత్ములను హైజాక్ చేస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరో కాంగ్రెస్ నేతకు గౌరవ సూచికంగా మెమోరియల్-ను ఏర్పాటు చేయనుండడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే గుజరాత్-లో కాంగ్రెస్ నేత, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రెండు రోజుల క్రితం స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని అందించింది. ఈ పరిణామం కాంగ్రెస్-కు ఇబ్బందిగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: