ఆంధ్రా సీఎం చంద్రబాబు మరోసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం తర్వాత సుదీర్ఘ సమయం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. జగన్ కు ఏం తెలుసని పట్టిసీమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

జగన్ ను విమర్సిస్తూనే చంద్రబాబు ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లనాన్న కూడా అలాగే చేశాడు.. అంటూ వైఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. పోలవరం ప్రాజెక్టుపై శ్రద్ధపెట్టకుండా అవినీతి సొమ్ముకోసమే ఆశపడ్డారని మండిపడ్డారు. రిజర్వాయర్ నిర్మాణంపై దృష్టిపెట్టకుండా కాట్రాక్టుల్లో సొమ్ము నొక్కేసేందుకు కాలవల నిర్మాణంపైనే ఫోకస్ చేశారని చెప్పుకొచ్చారు. 

ఆశించిన స్థాయిలో కమీషన్లు రాలేదని.. పోలవరం ప్రాజెక్టును వైఎస్ మధ్యలోనే ఆపివేయించారని చంద్రబాబు ఆరోపించారు. కాలువల పేరుతో 2500 కోట్లు కుంభకోణం జరిపారని చంద్రబాబు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవస్థనే కంపు కంపు చేశారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. 

పనిలో పనిగా వైఎస్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిపైనా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చిన్నాన్నకు ఏం తెలుసని అనంతపురం జిల్లాకు వెళ్లి తగాదా పెట్టుకున్నారని మండిపడ్డారు. వైఎస్ చనిపోయి ఇంతకాలమైనా ఇంకా టీడీపీ ఆయన పాలనపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇది కొందరు వైఎస్ అభిమానులకు ఆగ్రహం కలిగిస్తోంది. చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: