విద్యుత్‌ ఛార్జీలు పెంచిన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలనుపెంచేందుకు సన్నద్దమవుతున్నాయి. సంస్థను నష్టాల నుండి కొంతైనా గట్టెక్కించాలంటే ప్రయాణ ఛార్జీల పెంపు అనివార్యమని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2013 నవంబరు తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. అప్పుడు కూడా పల్లె వెలుగు బస్సులను మినహాయించి లగ్జీరీ, సూపర్‌డీలక్స్‌, ఇతర ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులన్నింటపౖౖె 9.5శాతం వరకు ఛార్జీలు పెంచారు. తర్వాత గవర్నర్‌ పాలన, సాధారణ ఎన్నికల సమయంలో కూడా పెట్రోలు ఛార్జీలు పెరగ డంతో మళ్ళీ ఆర్టీసీ నష్టాల బాట పట్టింది. వాస్తవానికి కొత్త ప్రభుత్వాలు పగ్గాలు చేపట్టగానే ఛార్జీల పెంచాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించలేదు. దీనికితోడు అంతర్జాతీయమార్కెట్‌లో క్రూడాయిలు ధరలు గణనీయంగా తగ్గడంతో దేశంలో డీజిల్‌, పెట్రోలు ధరలు తగ్గాయి. డీజిల్‌ రేటు దాదాపు గత 9 నెలల కాలంలో లీటరుకు రూ.15 తగ్గింది. ఈ పరిణా మాలు ఆర్టీసీకి కలిసొచ్చాయి. చాలా వరకు సంస్థకు నష్టాలు తగ్గాయని ఊపిరిపీల్చుకుంటున్న పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ టాక్స్‌ పెంచింది. దీంతో లీటరుకు రూ.4 ధర పెరిగింది. ఇది సంస్థకు ఇబ్బందికరంగా మారింది. మళ్ళీ నష్టాలు రోజురోజుకూ పెరగడం ఆరంభిం చాయి.

గత ఆర్థిక సంవత్సరంలో ఉభయ రాష్ట్రాల్లో కలిపి సంస్థకు రూ.900 కోట్ల మేర నష్టాలొచ్చాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ నష్టం ఫిబ్రవరి నాటికి రూ.554.29 కోట్లు ఉండటం గమనార్హం. ఇవిగాక ఇప్పటివరకు సంస్థకు సుమారు రూ.5వేల కోట్లు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థను అప్పులు, నష్టాల ఊబినుండి గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంపు అనివార్యమని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా తెలియజేసినట్లు తెల్సింది. ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ఛార్జీల పెంపు నుండి పల్లె వెలుగు, సిటీ బస్సులను మినహాయించాలని యోచిస్తున్నారు. అలాగే మిగిలిన బస్సులపై 10శాతం వరకు పెంచడం వల్ల పెద్దగా ప్రయాణీకుల నుండి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. ఇటీవల విద్యుత్‌ ఛార్జీలు పెంపు విషయంలో సైతం 200 యూనిట్లు లోపు కరెంట్‌ వాడే వినియోగదా రులను మినహాయించిన విషయం తెల్సిందే. ఇదే తరహాలో బస్సు ఛార్జీలను కూడా సామాన్యులపై భారం పడకుండా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై పెంచాలని యోచిస్తున్నారు.


ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుకు కిలోమీటరుకు 59 పైసలుండగా, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకు 79 పైసలు, డీలక్స్‌కు 89, సూపర్‌ లగ్జరీకి 105, ఇంద్ర 132, గరుడ 15, గరుడ ప్లస్‌ 165, వెన్నెల 230 పైసలుగా వుంది. అలాగే వీటికి వరుసగా కనీస ఛార్జీగా రూ.5, 10,15,15,25, 25, 25, 25, రూ.50లుగా వున్నాయి. వీటిలో పల్లె వెలుగు బస్సులను మినహాయించి మిగిలిన సర్వీసులకు 10శాతం వరకు పెంచాలని యోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర పన్ను వివాదం నెలకొనడంతో పాటు, ఆర్టీసీ సిబ్బంది ప్రస్తుతం ఫిట్‌మెంట్‌,బోనస్‌, ఇతర సమస్యలపై ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నందున కొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ప్రభుత్వాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: