పోలీసులకూ మీడియాకు అవినాభావ సంబంధం ఉంటుంది. విధి నిర్వహణలో భాగంగా మీడియావారికి పోలీసుల సహకారం.. పోలీసులకు మీడియా అవసరం.. ఎప్పుడూ ఉంటాయి. ఐతే ఏదైనా సంచలన ఘటన జరగ్గానే మీడియా చేసే హడావిడి అంతా ఇంతా కాదు..

ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు మధ్య నెలకొన్న పోటీ కారణంగా ఎవరికి వారే ఎక్ల్లూజివ్ ఇంటర్వూల కోసం వివరాల కోసం పాకులాడటం కామన్ అయ్యింది. ఒక్కోసారి మీడియా అత్యుత్సాహం పోలీసుల విధినిర్వహణకు అడ్డం పడుతుంది. వారికి చిర్రెత్తిస్తుంది.

నల్గొండ జిల్లాలో తనిఖీ చేస్తున్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపిన సంచలన ఘటన విషయంలోనూ అదే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటనాస్థలానికి వచ్చిన ఎస్పీ ప్రభాకర్ రెడ్డి.. టీవీ9 మీడియా విలేకరిని పక్కకు నెట్టేయడం కలకలానికి దారి తీసింది. 

ఈ ఘటనను లైవ్ లో కవర్ చేస్తున్న టీవీ9 విలేకరి.. ఘటనాస్థలంలోని వివరాలు చెబుతూనే.. అక్కడే ఉన్న ఎస్పీని ఈ ఘటన గురించి వివరాలడిగారు. దాంతో ఎస్పీకి ఆగ్రహం వచ్చింది. ఇప్పటికే మీ టీవీ9కు రెండు సార్లు చెప్పేశాను.. ఇంకెన్నిసార్లు చెప్పాలంటూ కాస్త విసుగు ప్రదర్శించారు. మీ లోకల్ రిపోర్టర్ కు అన్నీ చెప్పేశానంటూ లైవ్ లోకి వచ్చేందుకు నిరాకరించారు. 

అంతే ఇక టీవీ9 రిపోర్టర్ వార్తకు మరింత మసాలా జోడించారు. ఎస్పీ మీడియాను దూరంపెడుతున్నారని.. తాము హైదరాబాద్ లో డీజీపీనే ఇంటర్వ్యూ చేస్తుంటామని.. కానీ ఇక్కడ ఎస్పీ తమను తన పోలీసులతో విలేకరును పక్కకు నెట్టేయించాడని లైవ్ లో చెప్పడం మొదలుపెట్టాడు. అసలే నిందితులు దొరక్క సతమతమవుతుంటే ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ తలపట్టుకున్నారు ఎస్పీ ప్రభాకర్ రెడ్డి. 

ఇలాంటి సమయాల్లో మీడియా కూడా సంయమనం పాటించాలి. పోలీసులు ఒక్కో మీడియా ప్రతినిధికి రెండు, సార్లు మూడు సార్లు ఇంటర్వ్యూలిస్తూ కూర్చుంటే.. వారి పని ఎప్పుడు చేసుకోవాలి. కాస్త ఆలోచించాల్సిందే కదా..! 


మరింత సమాచారం తెలుసుకోండి: