మనల్ని మనం పొగుడకోకుంటే.. పరాయి వాళ్లు ఎందుకు పొగుడుతారు? అనేది చాలా మందిలో కనిపించే సిద్ధాంతం. ఎదుటివాళ్లకు ఇది సొంతడబ్బా కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తుంది గానీ.. అలా కొట్టుకుంటున్న వారికి మాత్రం చాలా హాయిగా ఉంటుంది. అదే రాజకీయాల్లో అయితే.. ఒకవైపు తాము ఏం పనిచేసినా.. రాజకీయ ప్రత్యర్థులు తప్పుపడుతుంటారు కనుక.. ఇలా తమ చేతల గురించి తామే సొంత డబ్బా కొట్టుకోవడం అనేది చాలా అవసరమైన విద్యగానే నాయకులు భావిస్తుంటారు. అందుకే కాబోలు.. ప్రతిపక్షాల నుంచి తమ నిర్ణయాల మీద విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ సమయంలో మోడీ సర్కారు కూడా తమ భాజపా ఎంపీలందరికీ సొంతడబ్బా కొట్టుకోవడం ఎలా అనే అంశంపై ఓ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తోంది. అదేలెండి... మన కొత్త పథకాలు ఎలా అతి గొప్పవో.. ఎంపీలకు వివరించే కార్యక్రమం అని దానికి పేరు పెట్టారు.


మోడీ సర్కారు వచ్చిన ఈ ఏడాది రోజుల్లో భూసేకరణ ఆర్డినెన్స్‌ సృష్టించినంత రగడ మరే నిర్ణయానికీ రాలేదు. ఈ నిర్ణయం ద్వారా పేద రైతులను కాలరాచేస్తున్నారంటూ అందరూ నానా గొడవా చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఊపిరాడకపోతున్న మాట వాస్తవం. ఇప్పటికే ఒకసారి ఆర్డినెన్స్‌ చేశాక.. దాన్ని బిల్లుగా సభ ముందు ఆమోదింపజేసుకోలేక మళ్లీ ఆర్డినెన్స్‌గా తీసుకురావడంలోనే ఈ విషయంలో మోడీ మొండిపట్టుదల కూడా తెలిసిపోతోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఢల్లీిలో చాలా పెద్దస్థాయి నిరసన కార్యక్రమాల్ని కూడా ప్లాన్‌ చేస్తున్న సమయంలో.. పార్లమెంటు రెండో విడతబడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోయే ముందు తమ పార్టీ ఎంపీలకు భాజపా ట్రైనింగ్‌ ఇస్తోంది. భూసేకరణ బిల్లు భూతాన్ని పేదలు మరచిపోయేలా వారిని ఎలా మభ్యపెట్టాలో ఎంపీలకు ట్రైనింగ్‌ ఇవ్వబోతున్నారు. పేదలకోసం తాము చేసిన ఇతర అనేక నిర్ణయాల గురించి చెప్పబోతున్నారు. అలాగే ఈ భూసేకరణ బిల్లు వల్ల దేశం చాలా ముందుకెళ్లిపోతుందని నమ్మించడం ఎలాగో నేర్పిస్తారు.

ఈ వర్క్‌షాప్‌కు ప్రధాని మోడీతో పాటూ పార్టీ సారధి అమిత్‌షా, జెపినడ్డా, సుష్మాస్వరాజ్‌, బిల్లు పెట్టబోయే మంత్రి బీరేంద్ర సింగ్‌ తదితరులు హాజరవుతారు. ఒక్క విషయంలో మాత్రం ఎవ్వరికీ సందేహం లేదు. ఇలా తిమ్మిని బమ్మిని చేసి.. ప్రజలకు మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించడం ఎలాగో తమ పార్టీ ఎంపీలకు విపులంగా చెప్పడానికి వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ లాంటి ఉద్ధండులు క్లాసులు తీసుకుంటారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: