ఆదేమిటి సత్యం రామలింగరాజు అంటే.. ఆయన భారతదేశపు ఐటీ పరిశ్రమకు సంబంధించినంత వరకు మరో బిల్‌గేట్స్‌ అంతటి వ్యక్తి కదా.. ఈ కొత్త ఉద్యోగాల ప్రస్తావన ఏమిటి? అనే సందేహం కలుగుతోంది కదా! నిజమే... ఆయనకు ఆల్రెడీ ప్రజల్లో ఉన్న ఇమేజి.. మీరు అనుకుంటున్నదే. కానీ సత్యం ఆర్థిక కుంభకోణంలో జైలు శిక్ష పడిన తర్వాత.. (మున్ముందు పై కోర్టుల ద్వారా ఉపశమనం రాకపోయినట్లయితే) మరో నాలుగేళ్లపాటూ ఆయన సాధారణ ఖైదీలాగా జైలులో గడపాల్సిందే. ఈ జైలుజీవిత కాలంలో.. జైలు అధికారులు ఆయనకు అప్పగించబోయే ‘పని’ గురించే ఇప్పుడు ఈ చర్చ.

రామలింగరాజు` ఓ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా తన సంస్థల్లో కొన్ని వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు. ఆయన ఇప్పుడు జైలులో నాలుగ్గోడల మధ్య కూర్చుని.. తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ.. తనకు ఇవ్వబోయే పని గురించి ఆలోచించుకుంటున్నారు. చర్లపల్లి సెంట్రల్‌ జైలులో రామలింగరాజు సాధారణ ఖైదీ లాగానే గడుపుతున్నారు. కాకపోతే.. ఆయన తన దినచర్యలో ఎక్కువభాగం.. అంటే, కాలకృత్యాలు, భోజన వేళల్లో తప్ప మెలకువగా ఉన్నంత సేపూ లైబ్రరీ రూంలోనే గడుపుతున్నారుట. జైలులో ఆయన ఎవ్వరితోనూ మాట్టాడడం లేదని, పుస్తకాలు చదవడంలోనే సమయం గడచిపోతున్నదని వార్తలు వస్తున్నాయి.

సత్యం కేసులో జైలు శిక్ష పడిన నిందితుల్లో ఎవ్వరికీ ఇంకా చర్లపల్లి జైలు అధికారులు ‘పనులు’ కేటాయించలేదు. సోమవారం నాడు వీరందరికీ పనులు అప్పగిస్తారు. సత్యం రామలింగరాజును మాత్రం.. ఆయన ప్రవృత్తికి తగినట్లు.. ఆయన నైపుణ్యాలు జైలులోని వారందరికీ కూడా ఉపయోగపడేట్లు వాడుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రకారం.. రామలింగరాజుకు జైల్లోని స్కూలు, లైబ్రరీ, కంప్యూటర్‌ క్లాస్‌ల నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారట. రామలింగరాజు మాత్రం.. ఈ మూడు పనుల్లో లైబ్రరీ ఇన్చార్జిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి ఆయన ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యే పనులను ఇష్టపడడం లేదని అనుకోవచ్చు. మూడేళ్లు అండర్‌ ట్రయల్‌ ఖైదీగానే జైల్లో ఉన్న రామలింగరాజుకు పడిన మొత్తం శిక్ష ఏడేళ్లు. ప్రస్తుతం ఆయన జైల్లో ఇంకా నాలుగేళ్ల పాటూ ఉండాలి. ఆయన సత్ప్రవర్తనతో ఉంటే.. మూడేళ్లలోనే శిక్ష పూర్తి కావచ్చునని కూడా జైలు అధికారుల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి ఈ బైర్రాజు రామలింగరాజు ఇప్పుడు లైబ్రేరియన్‌ అవతరాంలోకి మారబోతున్నారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: