చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిని మరో సింగపూర్ చేస్తామంటున్నారు. అందుకోసం విదేశాలు తిరుగుతున్నారు. ప్రపంచంలోనే ది బెస్ట్ మోడల్ కావాలంటున్నారు. జపాన్, సింగపూర్, చైనా సాయం కోరుతున్నారు. మంచిదే. ఓ మంచి నగరం కోసం ఈ ప్రయత్నం మంచిదే.. 

కానీ రాజధాని భూములను ఇష్టారాజ్యంగా కొందరికి కట్టబెడుతున్నారన్న ఆరోపణలు ఆయన కృషిని నీలినీడల్లా కమ్మేస్తున్నాయి. ప్రత్యేకించి ఈషా ఫౌండేషన్ కోసం రాజధాని ప్రాంతంలో 400 ఎకరాలు కేటాయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. గతంలో ప్రభుత్వోద్యోగుల కోసం కోట్లు ఖర్చుపెట్టి ఇదే ఫౌండేషన్ తో యోగా క్లాసులు కూడా ఇప్పించారు. 

ఆ యోగాతో ఉద్యోగులు నేర్చుకున్నదెంతో కానీ.. కష్టకాలంలో ఉన్న ఖజానా నుంచి 4 కోట్లు వరకూ ఈషా ఫౌండేషన్ కు వెళ్లిపోయాయట. అప్పుడే ఈషా ఫౌండేషన్ తో ఎందుకంత కుమ్మక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 400 ఎకరాలు కట్టబెట్టడంతో విపక్షాలు ఆరోపణల జోరు పెంచాయి. 

చంద్రబాబు రాజధాని భూమలు బాబాలకు దోచిపెట్టే సంస్కృతి మానుకోవాలని విజయవాడలో మాజీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఈషా పౌండేషన్‌‌కు 400 ఎకరాలు విద్యా సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ఆర్హతతో ఈషా బాబాకు భూములు కట్టబెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈషా బాబా చుట్టూ అధికారులు వంగి వంగి దండాలు పెడుతూ తిరుగుతున్నారని.. ఆయన వెనుక ఎవరున్నారో తేలాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: