ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘం (ఏపీఓఏ) పగ్గాల కోసం తెలుగుదేశం పార్టీలో రగడ ఆరంభమైంది. ఒక వర్గం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, మరో వర్గం ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎన్నికలే నిర్వహిం చుకుంది. ఎవరికి వారు పోటీ సంఘానికి గుర్తింపులేదంటూ చెబుతున్నారు. ఒక వర్గానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అధ్యక్షుడుగా ఎన్నికవ్వగా, మరో వర్గానికి అధ్యక్షుడుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అధ్యక్షుడయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ఒలింపిక్‌ సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసినట్లు సీఎం రమేష్‌ చెబుతుండగా, అసలా వర్గానికి ఇండియన్‌ ఒలింపిక్‌ సంఘం గుర్తింపేలేదంటూ పోటీ సంఘం ఆరోపిస్తోంది. రాష్ట్ర విభజనతో సవా లక్ష సమస్య లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతమతమవుతుంటే, ఇద్దర ఎంపీల మధ్య ఒలింపిక్‌ వార్‌ జరగటం అధినేతకు తలనొప్పిగా తయారైంది. ఈ నెల నాలుగో తేదీన తిరుపతిలో ఎన్నికలు నిర్వహించుకున్న సంఘం 19వ తేదీన గుంటూరులో తొలి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. మరో సంఘం అధ్యక్షుడుగా ఎంపీ సీఎం రమేష్‌ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొన్ని పదవులకు 19న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణాకు రెండు ఒలింపిక్‌ సంఘాలు ఏర్పటయ్యాయి. దీంతో దీర్ఘకాలంగా రెండు వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరోసారి బహిర్గత మైంది. రాష్ట్ర విభజనతో ఒలింపిక్‌ అసోసియేషన్‌ కూడా రెండుగా విడిపోయింది. అటు తెలంగాణ లోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పోటా పోటీగా రెండేసి సంఘాలు ఆవిర్భవించాయి. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఒలింపిక్‌ సంఘంలో పెద్ద ఎత్తున విబేదాలు ఉన్నాయి. అప్పటి అధ్యక్షుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్‌పై న్యాయపోరాటం చేసిన ఏపీఓఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.కోదండరామయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఈ నెల నాలుగో తేదీన సంఘం ఏర్పాటవ్వగా, తెలంగాణాలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కురువృద్దుడు రంగారావు ఆధ్వర్యంలో శనివారం తెలంగాణా సంఘం ఏర్పాటైంది. మరోవైపు రాజగోపాల్‌, జగదీశ్వర్‌ యాదవ్‌ నేతృత్వంలో ఏపీ, తెలంగాణాకు వేర్వేరుగా 19న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఒలింపిక్‌ సంఘంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎవరికి వారు తమదే అసలైన సంఘమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నెల నాలుగో తేదీన ఏర్పాటైన ఏపీఓఏకు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ చైర్మన్‌గా, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అలాగే 19న ఎన్నికలు జరగనున్న సంఘానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఏకగ్రీవంగా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఒకటీ రెండు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆ సంఘం సన్నాహాలు చేస్తోంది. 


ఆ సంఘానికి గుర్తింపు లేదు : ఏపీఓఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామయ్య

ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఏపీఓఏ) ఎన్నికలు చెల్లవని అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.కోదండరామయ్య చెప్పారు. భారత్‌ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) గుర్తింపు ఉన్న తమదే అసలైన సంఘమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఓఏను విభజించే అధికారం ఒక్క ఐఓఏకే ఉందని తెలిపారు. దీనిపై ఏడాది క్రితమే ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహత అప్పటి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్‌కు రాసిన లేఖను దాచిపెట్టారని విమర్శించారు. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలోని ఏపీ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరామయ్యతో పాటు పలువురు ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడారు. తమదే అసలైన సంఘమంటూ పోటీ సంఘం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. బల నిరూపణ కోసం అందిరని బతిమలాడుకుంటు న్నారని చెప్పారు. ఇదిలవుండగా, పోటీ సంఘం అధ్య క్షుడు సీఎం రమేష్‌ గంటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తానే ఏపీ ఒలింపిక్‌ సంఘానికి అధ్యక్షుడుగా ఉండబోతున్నట్లు ప్రచారం చేసుకోవటం హస్యాస్పదంగా ఉందన్నారు.. ఈ విషయంలో తాను జయదేవ్‌తో మాట్లాడానని, రెండు సంఘాలు కలిసే పని చేస్తాయంటూ క్రీడా సంఘాలను తప్పుదోవ పట్టించేలా రమేష్‌ వ్యవహరిస్తున్నారనటం సరికాద న్నారు. అసలు సీఎం రమేష్‌కు క్రీడా పరిజ్ఞానంలేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం సమక్షంలో రాజీ కుదిర్చినా సీఎం రమేష్‌ను తమ వర్గంలో కలుపుకునే సమస్యేలేదని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలకు జయదేవ్‌ తలొగ్గితే, తమలోనే ఒకరిని అధ్యక్షుడుగా నియమించుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. నిజమైన క్రీడా సంఘాలు, దేశానికి, రాష్ట్రా నికి పతకాలు తెచ్చే సంఘాలు తమకు మద్దతుగా ఉన్నాయన్నారు. విలేరుల సమావేశంలో భారత్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కేసీహెచ్‌ పున్నయ్య చౌదరి, బాల్‌ బ్మాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ అమరకుమార్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎ.రమణరావు, అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి ఏవీ రాఘవేంద్రరావు, బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర ప్రతినిధి అంకమ్మచౌదరి, ది కృష్ణాజిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు అర్జా పాండు రంగారావు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: