ఆరురోజుల చైనా పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టూర్ విశేషాలను ప్రధానికి వివరిస్తానని తెలిపారు. వచ్చేనెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో ముందస్తుగా తమను పంపించారని వెల్లడించారు. చైనాతో మొత్తం 29 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. చైనాలోని మూడు ప్రధాన ప్రాంతాలైన బీజింగ్, చెంగ్డూ, షాంఘై ప్రాంతాలను బాబు టీమ్ సందర్శించింది. 

చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలు, వాణిజ్య ప్రతినిధులతోనూ చర్చలు జరిపినట్టు చంద్రబాబు తెలిపారు. భారత్‌తో సంబంధాలు పెంపొందించుకోవడానికి ఆదేశం చాలా ఆసక్తిగా వుందని, వాణిజ్యపరంగా మొత్తం 29 అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. చైనాలోని కంపెనీలు ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తు్న్నాయని అన్నారు. అలాగే ఏపీ రాజధాని కూడా షాంఘై మాదిరిగా అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని కోరామని, అమరావతి విశిష్టత, దాని నిర్మాణం గురించి వివరించినట్టు తెలియజేశారు. 


ప్రజలు అభివృద్ధి చెందాలని అనుకుంటే అందుకు ప్రభుత్వం మెరుగైన పాలన ఇవ్వాలని, దీనికి కొందరు రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పెట్టుబడులు పెట్టేవారు లాభాలనే కోరుకుంటారు గనుక వారికి కొన్ని రాయితీలు ఇవ్వక తప్పదన్నారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న రాయితీల వల్ల ప్రపంచవ్యాప్తంగావున్న ప్రముఖ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ఎంతవరకు సఫలీకృతమవుతామో వేడి చూడాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు‌నాయుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: