దేశంలో అభివృద్ధికి నమూనా చెప్పుకొంటున్న గుజరాత్ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. శ్రమకు తగిన ప్రతిఫలం వారికి అందడం లేదు. దేశంలో 20 రాష్ర్టాలను పరిశీలించినప్పుడు అతితక్కువ వ్యవసాయ కూలి పొందుతున్నవారిలో మధ్యప్రదేశ్ తర్వాత గుజరాత్ వాసులే ఉన్నారు. కేంద్రప్రభుత్వ, కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గుజరాత్‌లో సగటు దినసరి కూలి రూ.169.32. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారత ఆర్థిక వ్యవస్థకు గ్రామాలే పట్టుగొమ్మలు అని భావించినప్పటికీ వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తున్న దినకూలీల పరిస్థితి దినదినగండంగానే ఉన్నది. వ్యవసాయ కూలీలకు అత్యధికంగా చెల్లిస్తున్న రాష్ర్టాల్లో కేరళ మొదటి స్థానంలో (రూ.582.38), జమ్ముకశ్మీర్ రూ.382.14, తమిళనాడు రూ.350.97, హర్యానా రూ. 346.55, హిమాచల్ ప్రదేశ్ రూ. 312.43 చెల్లిస్తున్నాయి. అతితక్కువగా చెల్లిస్తున్న రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్ రూ.154.18, గుజరాత్ రూ.169.32, ఒడిశా రూ.187.70, మహారాష్ట్ర రూ. 195.74, ఉత్తరప్రదేశ్ రూ.196.20 ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: