ఓ అందమైన అమ్మాయి మెడలో నెక్లస్ ఎంత అందమో.. భాగ్యనగరానికి హుస్సేన్ సాగర్.. దాని చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్ కూడా అంతే అందం. హుస్సేన్ సాగర్ గట్టు ట్యాంక్ బండ్ పై  చరిత్ర ఘనతకు సాక్ష్యాలుగా మహనీయుల విగ్రహాలు.. సాగర్ చుట్టూ లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్, ప్రసాద్ ఐమాక్స్.. ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు..

హైదరాబాద్ కోల్పోతున్నామని బాధపడే ఆంధ్రావాసులకు ఆ కొరత లేకుండా.. హుస్సేన్ సాగర్ లాంటి పర్యాటక ఆకర్షణలే ఇప్పుడు ఆంధ్రా రాజధానిలోనూ ఏర్పాటు కాబోతున్నాయి. భవనాలు, రోడ్లు అయితే కట్టుకోవచ్చు కానీ.. హుస్సేన్ సాగర్ ఎలా కడతారని మీకు అనుమానం రావచ్చు. అందుకు పరిష్కారం.. కొండవీటి వాగు.   

రాజధాని ప్రాంతంలో కీలకమైన సమస్యగా ఉన్న కొండవీటివాగు ముంపు నివారణకు నిపుణుల బృందంతో మంత్రులు అధ్యయనం చేయిస్తున్నారు. హైదరాబాద్‌  ట్యాంక్‌బండ్‌ తరహాలో కొండవీటివాగును పర్యాటక కేంద్రంగా  తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ లా యాజ్ టీజ్ గా లేకపోయినా.. ఆ కొరత మాత్రం తీరే అవకాశం కనిపిస్తోంది. 

అంతేకాదు.. హైదరాబాద్ కు దీటుగానే కాదు.. హైదరాబాద్ కంటే ఓ మెట్టు ఎక్కువే అన్నట్టు.. అమరావతిలో ఆకాశాన్నంటే భవనాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ  చైనా సంస్థతో చంద్రబాబు ఇప్పటికే ఓ ఒప్పందం కుదుర్చుకుని వచ్చారట. అన్నీఇన్నీ కావు.. ఏకంగా వంద అంతస్తుల భవనం కట్టబోతున్నారు. ఇక అందులోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరతాయట. ఈ సౌకర్యాలన్నీ భలే ఊరిస్తున్నాయి.. కానీ ఆ కలలు సాకారం కావాలంటే మాత్రం కొన్నేళ్లు ఆగకతప్పదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: