మొసలికి నీళ్లలో ఉంటే ఎంత బలమో.. ఏనుగుకి నేల మీద ఉంటే అంత బలం.. వైసీపీ అధినేత జగన్ విషయంలోనూ అంతే.. జగన్ కు సొంత జిల్లా కడపలో తిరుగులేని పట్టుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఐతే.. ఇప్పుడు క్రమంగా సీన్ మారుతోందా..? 

జనం సంగతేమో కానీ.. అధికారాన్ని ఉపయోగించి జగన్ కు ఎర్త్ పెట్టడానికి అధికార టీడీపీ కాచుకుని కూర్చుంది. ఆ పార్టీ నేతలకు ఇప్పుడు డీసీసీబీ ఎన్నిక ఓ వరంగా మారింది. వాస్తవానికి ఈ డీసీసీబీ పీఠం నిన్న మొన్నటి వరకూ వైసీపీదే. కానీ  జగన్ ను ఇరుకున పెట్టేందుకు కొందరు సహకార సంఘాల డైరెక్టర్లను బుట్టలో వేసుకుని.. వైసీపీని టీడీపీ నేతలు దెబ్బతీశారు. 

కడప డీసీసీబీ ఛైర్మన్ గా దువ్వూరుకు చెందిన వైకాపా నేత తిరుపాల్ రెడ్డి 2013లో గెలుపొందారు. టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాల వల్ల.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మద్దూరు సహకార సంఘం నుంచి ఏడుగురు వైకాపా డైరెక్టర్లు తమ పదవికి 10 రోజుల కిందట రాజీనామ చేశారు. దువ్వూరులో సింగిల్ విండో అధ్యక్ష పదవి కోల్పోయిన తిరుపాల్ రెడ్డి... సహజంగానే డీసీసీబీ ఛైర్మన్ పదవి కోల్పోయారు. 

త్వరలో ఛైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం కడప డీసీసీబీలో 18 మంది డైరెక్టర్లు ఉన్నారు. 12 మంది వైసీపీ. ఆరుగురు టీడీపీ. ఎన్నిక రోజు ఎవరికి పది మంది మెజారిటీ ఉంటే వారే ఛైర్మన్ పీఠం దక్కించుకుంటారు.  ఛైర్మన్ పదవి ఊడటంతో అలర్టయిన వైసీపీ డైరెక్టర్లను కాపాడుకునేందుకు మూడు రోజుల నుంచి ఇడుపులపాయ కేంద్రంగా శిబిరం ఏర్పాటు చేసింది. 10 మంది డైరెక్టర్లు జారిపోకుండా పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: