మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయా? స్వయంగా ముఖ్యమంత్రే ఎమ్మెల్యేల్లో ఈ చర్చకు అవకాశం కల్పించారు. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడంద్వారా ఎమ్మెల్యేల్లో ఆశలకు ప్రాణం పోశారు. రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 119 కావడంతో మంత్రుల సంఖ్య 18 వరకు ఉండాలి. ప్రస్తుతం మంత్రివర్గంలో పద్ధెనిమిది మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలు కావస్తోంది. ఈనెల 24న జరిగే పార్టీ ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరుపుతారు. పథకాల అమలుపై అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు. 27న జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధనకు ఏ విధంగా కృషి జరుగుతున్నది, ఏడాదిలో సాధించిన అభివృద్ధిని వివరిస్తారు. ప్లీనరీ, బహిరంగ సభ తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై సైతం ముఖ్యమంత్రి దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక్క మహిళ కూడా లేరు. శాసన సభ్యులుగా కొందరు మహిళా ఎమ్మెల్యేల పనితీరును పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో ఒక మహిళకు స్థానం కల్పిస్తారు. దేశంలో మహిళా మంత్రి లేకుండా ఉన్న ఏకైక మంత్రివర్గంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిలిచిపోయింది. దీనిపై విపక్షాలు కూడా విమర్శలు చేశాయి. టిఆర్‌ఎస్ తరపున ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేలంతా తొలిసారి ఎన్నికైన వారే కావడంతో వారిలో ఎవరికి స్థానం కల్పించాలో నిర్ణయించుకోలేకపోయారు. ఏడాది పాలనలో మంత్రివర్గంలో ఎవరి పనితీరు ఏమిటో ఎమ్మెల్యేల పనితీరు ఏమిటో ముఖ్యమంత్రి చూశారని, దీనికి అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.త్వరలోనే శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి మండలి సభ్యులుగా ఎన్నిక కానున్నారు. ప్లీనరీ, బహిరంగ సభ, మండలి ఎన్నికల తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే భావనతో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: