జనాన్ని ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల తమ తమ స్థాయి హోదాలతో నిమిత్తం లేకుండా ఒకరితో ఒకరు పోటీ పడి పనులు చేస్తున్నారు. కేసీఆర్  43 శాతం జీతాలు పెంచితే.. తన రాష్ట్ర ఆర్థిక స్థితి చూసుకోకుండా చంద్రబాబు కూడా అదే తీరుగా చేయడం లాంటివి అనేకం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో పన్నుల తగ్గింపు విషయంలో కూడా చంద్రబాబు.. అనుసరించాలని అనుకుంటున్న ఒక కొత్త పద్ధతి.. కేసీఆర్ కు కూడా రుచిస్తుందా? ప్రభుత్వానికి నిలకడైన ఆదాయం దక్కించే  ఈ విషయంలో ఆయన చంద్రబాబు సూత్రాన్ని తన రాష్ట్ర ప్రజలకు కూడా అందుబాటులోకి తెస్తరా లేదా? అనేది చర్చనీయాంశం అవుతోంది.

మోడీ సర్కారు


మోడీ సర్కారు ప్రతిభా పాటవాలతో సంబందం లేకపోయినప్పటికీ.. ఆయన వచ్చిన తర్వాత పెట్రోలు డీజిలు రేటు అదివరకటికంటె బాగానే తగ్గింది. ధరల పెంపులో ఉండే లోతుపాతులు తెలియని ప్రజలకు మాత్రం మోడీ వచ్చాక రేటు తగ్గింది అనే సంగతి మాత్రమే తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి పెట్రోలు డీజిలు విషయంలో మాత్రం కేంద్రం ఎంత తగ్గిస్తున్నది అనే దానితో నిమిత్తం లేకుండా... తమ కు పన్ను రూపంలో దక్కేలాభాలు తగ్గిపోతాయనే బాధతో, ఆవేదనతో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై వ్యాట్ లను పెంచుకుంటూ పోయాయి. కేంద్రం ద్వారా తగ్గేది కాస్తా... రాష్ట్రం పెంచిన పన్నుల్లో సరాసరి అయిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీలోని పలువురు.. డీజిలు ధర మరీ అధికంగా ఉన్నదనే విషయాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకొచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కాస్త సానుకూలంగానే స్పందించింది. మంత్రి యనమల రామక్రిష్ణుడు ఒక ప్రకటన కూడా చేశారు. డీజిలు ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాం అని త్వరలోనే ప్రకటిస్తాం అని అంటున్నారు. అదే జరిగితే అందరూ చంద్రబాబు బాగా చేశాడు అనుకుంటారు.


కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో


మరి ఆయనకు దక్కే అదే మంచి పేరు తనకు కూడా పొందడం కోసం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కూడా డీజీలుపై వ్యాట్ తగ్గిస్తారా లేదా అనేది అందరిలో ఉన్న సందేహం. ఇప్పటికే.. ఆంధ్రాకు వెళితే డీజిలు ట్యాంకు ఫుల్ ట్యాంకు చేయించుకుని వచ్చేయాలి.. అని తెలంగాణలోని వాహన దారులు అనుకునే పరిస్థితి ఉంది.. ఈ రెండు రాష్ట్రాల మధ్య ధరల్లో వ్యత్యాసం ఉంది. తెలంగాణలోనే రేటు కాస్త ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ తనకు కూడా ప్రజల వద్ద మంచి పేరు రావాలని కోరుకుని.. వ్యాట్ తగ్గిస్తారా లేదా... బడా పారిశ్రామిక వేత్తలకు వందల వేల కోట్లు దోచి పెడతామే తప్ప.. సామాన్యులకు ఇసుమంతైనా ప్రయోజనం కలిగించడం తమ లక్ష్యం కాదంటూ.. మిన్నకుండి పోతారా అనేది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: